వర్షాకాలం: కరోనా మహమ్మారితో పాటు ఇతర వ్యాధుల నుండి దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చాలా వరకు తగ్గింది. దాదాపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ సెకండ్ వేవ్ చాలా నష్టాలను చూపించింది. ఎన్నో ఇబ్బందులు, ఆక్సిజన్ లేకపోవడం సహా అనేక ఒడిదొడుకులు దేశ ప్రజలని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఐతే ప్రస్తుతం వర్షాకాల సమయం. ఇలాంటి తరుణంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్నాయి కూడా. అటు మహమ్మారి, ఇటు సీజనల్ వ్యాధులు.. రెండింట్లో ఏది సోకిందనే విషయాన్ని తేల్చుకోవడంపై సాధారణ జనాలు కొంత అయోమయంలో ఉన్నమాట నిజమే.

ఐతే మహమ్మారి సమయంలో ఉన్నాం కాబట్టి ఇతరత్రా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే. దానికొరకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వర్షాకాలమ్లో బాక్టీరియా, ఫంగస్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలి.

దోమల నుండి కాపాడుకోవాలి

వాటర్ కూలర్లు, టెర్రస్ పైన నీటి నిల్వలు, ఇతర ట్యాంకుల్లో నీరు నిలవడాలు ఉండకుండా చూసుకోవాలి. సాయంత్రం పూట బయటకి వెళ్ళాలనుకుంటే పూర్తి వస్త్రాధారణ ఉండాలి. షార్ట్స్ కాకుండా ప్యాంట్లు వేసుకోవాలి. దోమలని చంపే కాయిల్స్, రిపెల్లర్స్ వాడడం మంచిది.

వ్యక్తిగత శుభ్రత

ఆఫీసు నుండి బయటకు వచ్చాక ఖచ్చితంగా స్నానం చేయాలి. అప్పటి వరకు మన మీద ఉన్న సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. తరచుగా చేతులను శుభ్రం చేస్తూ ఉండాలి.

భౌతికదూరం

కోవిడ్ నిబంధనలు సడలించారు కాబట్టి బయటకు వెళ్ళే వాళ్ళు పెరుగుతారు. అందువల్ల ఎక్కడకు వెళ్ళినా భౌతికదూరం పాటించాలి. ఏం కాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అస్సలు వద్దు.

ఆహారం, పానీయం పరిశుభ్రత

శుభ్రమైన ఆహారం, నీళ్ళు మాత్రమే తాగండి. వీటిల్లో నిర్లక్ష్యం చేస్తే అనేక సీజనల్ వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే తినడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. బయటకు వెళ్దాం అనుకుంటే చాలా జాగ్రత్తలు పాటిస్తూ, శుభ్రత పాటించే ప్రాంతాల్లోకే వెళ్లండి.