నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తెలుగులో ఒక సామెత ఉంది. మనం మంచిగా మాట్లాడితేనే మనకి తోడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారని దానర్థం. అది నిజం కూడా. అలాగే, మన నోరు పరిశుభ్రంగా ఉంటేనే, మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అంటే, మన నోరు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుందన్నమాట. ఏదైనా జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు నోరు తెరవమనడానికి కారణం అదే. ఐతే నోటి పరిశుభ్రత గురించి సామాన్యుల్లో చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని అసలైన నిజాలని తెలుసుకుందాం.
నోటి గురించి మాట్లాడితే, దంతాలు, నాలుక పరిశుభ్రత గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా దంతాల శుభ్రత చాలా అవసరం.
అపోహ 1
పంటినొప్పి లేకపోతే నోరు శుభ్రంగా ఉన్నట్టే అనుకోవడం.
నిజం
పళ్ళ మధ్య కేవిటీ పెరిగినపుడు అది పంటికి నొప్పి కలిగించదు. నొప్పి కలుగుతుందంటే దానర్థం కేవిటీ సమస్య తీవ్రంగా మారిందనే. దానికోసం తొందరగా ట్రీట్ మెంట్ అవసరం ఉంటుంది. రెగ్యులర్ గా వైద్యుడిని సంప్రదిస్తూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావు.
అపోహ 2
పళ్ళలో ఇరుక్కున్న ఆహారాన్ని తీయడానికి ప్రత్యేకమైన దారం లాంటివి వాడకూడదు. దానివల్ల చిగుళ్ళ నుండి రక్తం వచ్చే అవకాశం ఉంది.
నిజం
చిగుళ్ళ నుండి రక్తం రావడానికి కారణం సరిగా బ్రష్ చేయకపోవడం లేదా పళ్ళలో ఇరుక్కున్న పదార్థాలని తీసివేయకపోవడం.
అపోహా 3
గట్టిగా బ్రష్ చేస్తేనే పళ్ళు శుభ్రంగా అవుతాయి.
నిజం
గట్టిగా బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ పొరకి హాని కలుగుతుంది. దానివల్ల పళ్ళు బలహీనంగా తయారవుతాయి. పన్ను పుచ్చిపోవడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. చిగుళ్ళు కూడా దెబ్బతింటాయి.
అపోహా 4
పళ్ళు తెల్లగా ఉన్నట్లయితే శుభ్రంగా ఉన్నట్టే
నిజం
పళ్ళు శుభ్రంగా ఉండడం అంటే పళ్ళలో ఎలాంటి పాచి లేకుండా ఉండడం మాత్రమే. పళ్ళు తెల్లగా ఉన్నంత మాత్రాన పాచి లేదని కాదు.