కూతురి జుట్టు రాలే సమస్య చూసి.. స్వయంగా ఆయిల్ తయారీ.. నేడు అదే వ్యాపారం..!

-

పదిలో ఎనిమిదిమంది.. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికోసం.. ఎన్నో హోమ్ రెమిడీస్, మరెన్నో ఆయిల్స్.. అయినా తీరని సమస్య.. తమ కూతురికి కూడా జుట్టు విపరీతంగా ఊడిపోవడంతో.. ఆమె బాధ చూడలేక.. ఎనభై ఐదు ఏళ్లు పైనే వయసున్న ఆ వృద్ధదంపతులు.. నెట్ లో సమస్య ఎందుకు వస్తుందో పరిశోధన చేసి.. సరికొత్త ఆయిల్ తయారు చేశారు. రిజల్ట్ బాగుండటంతో.. ఓ స్టార్ట్ అప్ కూడా ప్రారంభించి.. నేడు ఎంతోమంది జుట్టు సమస్యను తీరుస్తున్నారు. భలే ఇంట్రస్టింగా ఉంది కదూ..!
సూరత్‌కు చెందిన రాధాకృష్ణ, శకుంతలా చౌదరి దంపతులు. దాదాపు యాభైఏళ్లపాటు కుటుంబ వ్యాపారాలు చూసుకుని 2010లో రిటైర్‌ అయ్యారు. ఈ చౌదరి దంపతుల కూతురి జుట్టు బాగా ఊడిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం మాత్రం తగ్గలేదట. దీంతో తన బాధను తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చెప్పింది. కూతురి బాధను చూడలేని ఆ దంపతులు అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దానికి గల కారణాలు ఏంటీ? అని లోతుగా ఏడాదిపాటు అధ్యయనం చేశారు.
‘‘పురుషులలో అయితే డైహైడ్రోటెస్టోస్టిరాన్‌ అనే ఆండ్రోజన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉండడవల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది’’ అని వారు గ్రహించారు. ఈ రెండు హార్మోన్లను సక్రమంగా పనిచేయించే పదార్థాల కోసం ఇంటర్నెట్‌ను క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. వారు దొరికిన సమాచారంతో… వారే ఒక సరికొత్త ఆయిల్‌ను తయారు చేశారు.
యాభై రకాల మూలికలు, కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆలివ్, ఆముదంలను ఉపయోగించి కోల్డ్‌ ప్రెస్డ్‌ పద్ధతిలో హెయిర్‌ అయిల్‌ను రూపొందించారు. వీటన్నింటిని కలిపి ఆయిల్‌ తయారు చేసి కూతురుకిచ్చి వాడమన్నారు. ఆ ఆయిల్‌ వాడిన దగ్గర నుంచి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగిందట.. దీంతో తాము రూపొందించిన ఆయిల్‌ బాగా పనిచేస్తుందని చౌదరి దంపతులకు అర్థమైంది. బంధువులు, స్నేహితులు కొంతమందికి ఆయిల్‌ ఇచ్చి వాడమన్నారు. వాడిన వారందరికి మంచి ఫలితం వచ్చింది.

అవిమీ…

మూడు నెలలపాటు ఆయిల్‌ను పరీక్షించి, ఫలితాలు అన్నీ పాజిటివ్ గానే ఉండటంతో.. అవిమీ హెర్బల్‌ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. అవిమీ ద్వారా ఎంతో నాణ్యమైన నూనెను విక్రయిస్తూ ఎంతోమంది జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఈ దంపతులు. ఇదేగాక ఆర్థో ఆయిల్, స్ప్రేలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
అలా కూతురి సమస్యకు పరిష్కారం కోసం.. వారు తయారు చేసిన ఆయిల్.. నేడు ఎంతోమంది జుట్టు సమస్యను తీరుస్తుంది. కుదిరితే మీరు ఓ సారి ట్రై చేయండి.! ఈ వయసులోనూ వారు అంత ఆలోచించి.. సమస్యను కూకటివేళ్లతో సహా పరిష్కరించారంటే గొప్ప విషయమే..!

Read more RELATED
Recommended to you

Latest news