అసలు దేశంలో 64 శాతం మంది వ్యాయామమే చేయడం లేదట. ఇక వారిలో 31 శాతం మంది తమకు సమయం దొరకనందువల్లే నిత్యం వ్యాయామం చేయడం కుదరడం లేదని చెప్పారట.
నిత్యం వ్యాయామం చేద్దామని అనుకుంటున్నా.. అందుకు టైం సరిపోక వ్యాయామం చేయడం లేదా..? అయితే చింతించకండి. అంటే మా ఉద్దేశం.. వ్యాయామం చేయకండి.. అని కాదు. కాకపోతే టైం సరిపోక వ్యాయామం చేయనివారిలో మీరుంటే బాధ పడకండనే మేం చెబుతోంది. ఎందుకంటే.. దేశంలో 64 శాతం మంది అసలు వ్యాయామమే చేయడం లేదట. ఇక వారిలోనూ టైం సరిపోక వ్యాయామం చేయనివారే ఎక్కువగా ఉన్నారట. ఓ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ చేపట్టిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
మింటెల్ అనే ఓ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇటీవలే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న 18 సంవత్సరాలకు పైబడిన 3వేల మందిని అధ్యయనం చేసింది. ఆ సంస్థ వారి వ్యాయామ వివరాలను అడిగి తెలుసుకుంది. దీంతో ఆ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. అసలు దేశంలో 64 శాతం మంది వ్యాయామమే చేయడం లేదట. ఇక వారిలో 31 శాతం మంది తమకు సమయం దొరకనందువల్లే నిత్యం వ్యాయామం చేయడం కుదరడం లేదని చెప్పారట.
ఇక మొత్తం 3వేల మందిలో 46 శాతం మంది ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని గడుపుతున్నారని వెల్లడైంది. కాగా వ్యాయామం చేసే 36 శాతం మందిలో 26 శాతం మంది నిత్యం వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నారట. వారు జిమ్‌కు, యోగా క్లాసులకు వెళ్తే డబ్బులు అధికంగా చెల్లించాలని భావిస్తున్నందునే అలా తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నారట. అలాగే మిగిలిన 10 శాతం మంది మాత్రమే యోగా, జిమ్‌లకు డబ్బులు ఖర్చు పెట్టి మరీ వెళ్తున్నారని వెల్లడైంది. అంటే.. కేవలం సంపన్న వర్గాలకు చెందిన వారే డబ్బులు వెచ్చించి యోగా, జిమ్, కార్డియో క్లాసులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. నిత్యం టైం దొరకడం లేదని అనుకునే వారు ఆ మాటను పక్కన పెట్టి కచ్చితంగా ఎంతో కొంత సమయం శారీరక శ్రమ చేయాల్సిందేనని, లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు..!