బీహార్‌లో NDA అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. నితీశ్ పాలనకే మళ్లీ ఓటేస్తారా..తేజస్వి యాదవ్‌కు అవకాశమిస్తారా..ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి..ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం రానుంది..బీహార్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. బీహార్‌లో ప్రతి 15ఏళ్లకోసారి ట్రెండ్ మారుతుంది. లాలూ-రబ్రీ.. 15ఏళ్ల పాలనకు చెక్ పెట్టి నితీశ్ అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా దాదాపు 15ఏళ్లు పవర్‌లో ఉన్నారు. ఇప్పుడు నితీశ్ నుంచి లాలూ తనయుడు తేజస్వీ అధికార పగ్గాలు అందుకునే అవకాశం ఉంది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బీహార్‌లో ఓట్ల లెక్కింపునకు అదనపు కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 38 జిల్లాలకు గానూ ఈసారి 55 కౌంటింగ్ కేంద్రాలు, 414 హాళ్లను సిద్దం చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. పాట్నాలో మాత్రం సిటీ పరిధిలోకి వచ్చే 14 నియోజకవర్గాల ఓట్లను కేవలం ఒకే కౌంటింగ్ కేంద్రంలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు..ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలవకు ఫలితాల ట్రెండ్ వెల్లడయ్యే అవకాశముంది..కౌంటింగ్ నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ (సీఆర్‌పీసీ) అమలు చేస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాటు చేశారు.