భారతీయులు వాడే వంటింటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులను అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే మెంతులు కేవలం రుచికే కాదు, ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలో కూడా ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వీటితో టైప్ 2 డయాబెటిస్‌ను చాలా సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో తెలిసింది.
నిత్యం 10 గ్రాముల మెంతుల పొడిని తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చని, తరచూ ఇలా చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అయితే కొందరికి మెంతుల పొడి పడదు. వికారం అనిపిస్తుంది. అలాంటి వారు రోజూ రాత్రి 10 గ్రాముల మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి, మెంతులను తింటే చాలు. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
మెంతుల్లో 4-హైడ్రాక్సీసొలేయూసీనే అనే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి యాంటీ డయాబెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహించేలా చేస్తాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అయితే మెంతులను నేరుగా తినలేని వారు వాటితో టీ తయారు చేసుకుని తాగినా చాలు.. వాటి ఫలితాలను పొందవచ్చు. ఒక గ్లాస్ వేడి నీటిలో 1 టీస్పూన్ మెంతులు, మెంతి ఆకులు వేసి 10 నిమిషాల పాటు అలాటే ఉంచాలి. అనంతరం అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపితే చాలు.. మెంతుల టీ తయారవుతుంది. దీన్ని రోజూ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలగే మెంతులను లేదా వాటి పొడిని పెరుగులో కలుపుకుని రోజుకు రెండు సార్లు తీసుకున్నా డయాబెటిస్ ను అదుపు చేయవచ్చు.