ఏషియన్ గేమ్స్ లో పతకం నెగ్గినా టీ అమ్ముకుంటున్నాడు..!

-

రీసెంట్ గా జరిగిన ఏషియన్ గేమ్స్ 2018 లో కాంస్య పతకం గెలిచాడు ఈ యువకుడు. పేరు హరీశ్ కుమార్. గేమ్స్ అనంతరం ఇండియాకు వచ్చిన హరీశ్ మళ్లీ తన పనిలోకి ఎక్కాడు. ఏంటా పని అంటారా? టీ అమ్మడం. అవును.. తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ టీ అమ్మడమే అతడి వృత్తి. భారత సెపక్ తక్రా జట్టులో సభ్యుడు ఈయన. భారత సెపక్ తక్రా జట్టు కాంస్య పతకం గెలిచింది కదా. అయినప్పటికీ.. మనోడి పరిస్థితి మాత్రం ఏంమారలేదట. చాలా పేదకుటుంబం అయ్యే సరికి టీ అమ్మనిదే రోజు గడవదట వాళ్లకు. ఢిల్లీలో ఉండే హరీశ్ ఫ్యామిలీ.. రోడ్డు ముందు ఓ టీకొట్టు పెట్టుకున్నారట. రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా గేమ్ ప్రాక్టీస్ కు సమయం కేటాయిస్తాడట హరీశ్.

“నాకు మంచి ఉద్యోగం కావాలి.. నా ఫ్యామిలీని పోషించుకోవాలి. మా ఫ్యామిలీలో ఎక్కవ మంది ఉండేసరికి రోజు గడవడం కష్టంగా ఉంది. 2011 లో ఈ గేమ్ ఆడటం ప్రారంభించా. దేశం కోసం ఇంకా ఆడాలనుంది. కానీ.. నా పేదరికం ఎక్కడ నా లక్ష్యానికి అడ్డొస్తుందోనని భయమేస్తోంది.. నాకోచ్ హేమ్ రాజ్ నాకు ఈ ఆట నేర్పించారు. స్పోర్ట్స్ అథారిటీ నుంచి నాకు అవసరమైన కిట్స్, డబ్బులు వచ్చేవి.. కానీ ఇప్పుడు ఆదుకునేవారు ఎవరూ లేరు..” అంటూ వాపోయాడు హరీశ్. దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినా మా వాడికి ఏం సహాయం చేయలేదని.. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి హరీశ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని అతడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news