విజయం సాధించకపోయినా సంతృప్తి బతికితే చాలా?

-

విజయం అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది. చిన్నప్పటి నుండి అమ్మా నాన్నా, సమాజం, నీ చుట్టూ నీ స్నేహితులు నీకేవేవో చెప్పి ఉంటారు. నువ్వలా అవ్వాలనీ, ఇలా అవ్వాలనీ కలలు కని ఉంటారు. వారనుకున్నట్టుగా నువ్వు మారితే వారి కల నెరవేరినట్టవుతుంది కానీ నీది కాదు. నువ్వు కన్న కలల్ని నెరవేర్చుకోకుండా, నీకు ఆనందం ఇచ్చే పనులు చేయకుండా అవతలి వారు నిన్ను గొప్ప అనుకోవాలని వారికి నచ్చిన పనులు చేస్తుంటే నువ్వు విజయం సాధించినట్లు ఎలా అవుతుంది.

నువ్వు చేసిన పని నీకు నచ్చకపోతే నీకు సంతృప్తి ఎలా వస్తుంది. ఎవరో నిర్దేశించిన గమ్యాలను నువ్వు చేధిస్తే నీ గెలుపెలా అవుతుంది. నీకు సంతృప్తినివ్వనిదేదీ గెలుపు కాదు. కేవలం డబ్బు మాత్రమే నిన్ను గెలిపించే విషయం కాదు. ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ గెలిచిన వాళ్లే అయితే వాళ్ళు కూడా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు. ఆత్మహత్య దాకా ఒకరి ఆలోచన వచ్చిందంటే వారు జీవితంలో ఎంత నిరాశలో కుంగిపోయుంటారో కదా!

డబ్బు ఖచ్చితంగా అవసరమే. అలాగే సంతృప్తీ అవసరమే. వేలకోట్లున్నా చిటికెడు సంతృప్తి లేకపోతే అవన్నీ వృధా అవుతాయి. అందుకే నీ ప్రయాణం నీకు ఆనందాన్నిచ్చేది అయ్యుండాలి. ఆ ఆనందంతో డబ్బు కూడా రావాలి. ఇలా రెండూ కలిసి వస్తే అంతకన్నా అదృష్టం ఉండదు. ఐతే చాలా కొద్ది మందికి మాత్రమే అది అదృష్టం వల్ల వస్తుంది. కానీ చాలా మందికి అది కృషి ద్వారానే వస్తుంది. ముందే చెప్పినట్టు డబ్బు ముఖ్యమే. కానీ అదే అన్నీ కాదు.

అందుకే మీకోసం మీకు కావాల్సిన పనులు చేసుకుంటూ సంతృప్తిగా బ్రతికే అవకాశం కోసం వెతకాలి. శోధించాలి. ఆనందం కోసం అన్వేషణ మొదలెట్టడంలోనూ ఆనందమే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news