డ్రిల్ మ్యాన్ ఆఫ్ హైదరాబాదా? అని నోరెళ్లబెట్టకండి. పైన ఫోటోలో చూశారుగా. తన శరీరాన్ని డ్రిల్ చేసుకొని మరీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు ఈ యువకుడు. అందుకే అతడిని డ్రిల్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తారు. నిజానికి ఇతడిని డ్రిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువాలి. ఎందుకంటే.. ఇండియాలోనే ఈ యువకుడిలా శరీరంలో డ్రిల్లింగ్ చేసుకునేవాళ్లు ఎవరూ లేరు.
సూర్యాపేట దగ్గర్లోని ఓ మారుమూల పల్లెకు చెందిన పనికెర క్రాంతికి సాహసాలు చేయడమంటే ఇష్టం. అందుకే.. కత్తులు, డ్రిల్స్, మంటలతో విన్యాసాలు చేస్తుంటాడు. డ్రిల్లింగ్ మిషన్ తో తన శరీరంలో గుచ్చుకుంటాడు. మంటను నోట్లో వేసుకుంటాడు. తన ముక్కుల్లో డ్రిల్లింగ్ చేసుకుంటాడు. తన గొంతులో 34 కత్తులను దించుకుంటాడు. అయినా అతడికి ఏం కాదు.
అతడు ఇలా చేయడానికి చాలా సంవత్సరాలు పట్టిందట. ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి.. సరైన వ్యాయామం చేయడం వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నాడట. పొలిటికల్ సైన్స్ లో పీజీ చదివిన క్రాంతికి కలెక్టర్ కావాలని ఉండెనట. అయితే.. ఆర్థిక ఇబ్బందుల వల్ల కలెక్టర్ కాలేకపోయాడు. బతుకు తెరువు కోసం ఇలా స్టంట్ మ్యాన్ అవతారం ఎత్తాడు. మిగితా సమయాల్లో మేస్త్రీ పని చేస్తాడట. తన స్టంట్స్ ను టీవీ షోలలోనూ ప్రదర్శించాడు క్రాంతి. ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి టీవీ షోలోనూ తన స్టంట్స్ ను ప్రదర్శించాడు. ఇప్పుడు డ్రిల్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ గా పిలవబడుతున్నాడు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ క్రాంతి పేరును ఎక్కించారు. ఇలా.. బతుకు తెరువు కోసం ఎంచుకున్న ఫీల్డే క్రాంతికి జీవితం అయిపోయింది.
(Video Courtesy: Telangana Today)