జీఎస్‌టీ అమలులో లేనప్పుడు బుక్ చేసుకున్న ట్రెయిన్ టిక్కెట్ కాబట్టి అప్పటి రూల్స్ ప్రకారం జీఎస్‌టీ వేయకూడదు.. కనుక తనకు రీఫండ్ రూ.100 వస్తుంది కదా.. అనే సమాచారాన్ని ఆర్‌టీఐ ద్వారా సేకరించి నిర్దారించున్నాడు.
సాధారణంగా మనం బస్సు ఎక్కినప్పుడో లేదా.. కూరగాయలు కొనేటప్పుడో.. ఆటోలు, ట్యాక్సీలలో వెళ్లినప్పుడో.. లేదా ఇతర సందర్భాల్లోనో.. ఒక్కోసారి మనకు చిల్లర లభించడం కష్టతరమవుతుంది. దీంతో మనకు రావల్సిన చిల్లరను వదిలేసి వెళ్లిపోతుంటాం. కానీ ఆ వ్యక్తి అలా చేయలేదు. తనకు రావల్సిన చిల్లర కోసం రెండు సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేశాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడు. అతను ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సుజిత్ స్వామి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
కాటాకు చెందిన సుజిత్ స్వామి ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతను తరచూ కాటా నుంచి ఢిల్లీకి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే 2017, ఏప్రిల్ 26వ తేదీన కాటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రైలు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అతను జూలై 2, 2017 నాడు ప్రయాణం కావల్సి ఉంది. అయితే ఆ రోజు వచ్చినా తనకు సీట్ కన్‌ఫాం కాలేదు. వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంది. దీంతో తాను బుక్ చేసిన ట్రెయిన్ టిక్కెట్‌ను రద్దు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి చార్జిలు పోను రూ.65లను రైల్వే పోర్టల్ అతని ఖాతాలో జమ చేసింది. అయితే జూలై 1, 2017 నుంచి జీఎస్‌టీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రైల్వే అతనికి రావల్సిన రూ.100 లోంచి రూ.35 కట్ చేసి రూ.65 రీఫండ్ ఇచ్చింది. ఈ క్రమంలో సుజిత్ స్వామికి బుర్రలో ఒక ఆలోచన ఠక్కున మెరిసింది.
జూలై 1, 2017 నుంచి జీఎస్‌టీ అమలులోకి వచ్చింది సరే.. కానీ తాను అంతకన్నా ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకున్నాడు కనుక.. అప్పుడు జీఎస్‌టీ లేదు కాబట్టి.. అప్పటి రూల్ మేరకు అతనికి రీఫండ్ ఇవ్వాలి. అంటే సుజిత్ స్వామికి రూ.100 రీఫండ్ కచ్చితంగా రావాల్సింది. కానీ రూ.65 మాత్రమే వచ్చాయి. దీంతో సుజిత్ స్వామి రైల్వేస్‌పై న్యాయ పోరాటం చేశాడు. అయితే అంతకు ముందుగా ఆర్‌టీఐ ద్వారా సమాచారం సేకరించాడు. జీఎస్‌టీ అమలులో లేనప్పుడు బుక్ చేసుకున్న ట్రెయిన్ టిక్కెట్ కాబట్టి అప్పటి రూల్స్ ప్రకారం జీఎస్‌టీ వేయకూడదు.. కనుక తనకు రీఫండ్ రూ.100 వస్తుంది కదా.. అనే సమాచారాన్ని ఆర్‌టీఐ ద్వారా సేకరించి నిర్దారించున్నాడు. అనంతరం కన్‌జ్యూమర్ ఫోరంలో తన పోరాటం కొనసాగించాడు.
ఈ క్రమంలో చివరకు సుజిత్ చేసిన పోరాటానికి రైల్వేస్ దిగి వచ్చింది. అతనికి రావల్సిన రూ.35లో రూ.33 చెల్లించింది. తమను రెండేళ్ల పాటు వేధింపులకు గురి చేసినందుకు ఆ రూ.2 ను జరిమానా కింద కట్ చేశామని అందుకే రూ.33 చెల్లించామని రైల్వే అధికారులు తెలిపారు. ఏది ఏమైనా తన న్యాయ పోరాటం విజయవంతం అయినందుకు సుజిత్ స్వామి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు అతను మనకు చెప్పేది ఒక్కటే.. మనం ఎక్కడైనా సరే.. మనకు రూ.1 రావాల్సి ఉన్నా వదలకూడదు. ఎందుకంటే.. అది మన కష్టార్జితం కదా.. అవును మరి.. ఎంతో కష్టపడితే గానీ మనం డబ్బులు సంపాదించలేం. అలాంటిది ఆ రూపాయిని కూడా మనం ఎందుకు వదులుకోవాలి ? ఇది నిజమే కదా..!