ప్రేమజంట విగ్రహాలకు పెళ్లి.. ప్రాణాలు పోయాక పంతాలు వదిలిన పెద్దోళ్లు ..!!

-

జీవితంలో కోట్లు సంపాదించడం కన్నా.. మంచి లైఫ్‌ పాట్నర్ దక్కించుకోవడం చాలా ముఖ్యం.. ఎంత సంపాదించినా.. ఇంట్లో ప్రశాంతత లేదంటే.. తిక్కలేస్తది..జీవితం మీద విరక్తి వస్తుంది.. అందుకే ఈరోజుల్లో చాలామంది.. ప్రేమపెళ్లిళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు.. ఆస్తులు, కులాల కన్నా.. హృదయం ముఖ్యమని చూస్తున్నారు. అయితే ఈరోజుల్లో నిజమైన ప్రేమ దొరకడం కష్టమైన పనే.. అలాంటి వారు దొరికినప్పుడు ఎవ్వరూ కూడా వదులుకోవడానికి ఇష్టపడరు.. ఇంట్లోవాళ్లను బతిమాలో, బెదిరించో ఎలాగోలా పెళ్లిచేసుకుంటారు.. ఈ జంట కూడా అలానే బతిమాలింది.. కానీ ఇంట్లోవాళ్లు ససేమీరా అన్నారు. కలిసిబతకలేం అని వాళ్లకు అర్థమైంది.. అందుకే కలిసి చనిపోయారు.. హైలెట్‌ ఏంటంటే.. ప్రాణాలు పోయాక పెద్దోళ్ల మనసులు మారాయి..
గుజరాత్‌లోని తాపీ(Tapi) జిల్లాలో ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఘోరంగా పెరుగుతోంది.. గణేశ్‌ పద్వీ, రంజన పద్వీ ప్రేమ జంటకు సంబంధించిన విషాద ఘటన జరిగింది కూడా ఈ ప్రాంతంలోనే. వీరిది తాపీ జిల్లాలోని నెవాలా గ్రామం. ఏడాది క్రితం ఈ ప్రేమ జంట చనిపోయింది. అంతకు ముందు వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి తప్ప పెద్దలు మాత్రం ఒప్పుకోలేదు..ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడవాలని నిర్ణయం తీసుకున్నారు. చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఇద్దరూ ప్రాణాలు విడిచారు. దీంతో అప్పట్లో ఈ విషయం ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
వారి మరణాలు ఇరువురి కుటుంబాల్లో ఎంతో మార్పును తీసుకువచ్చాయి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. తమ వల్ల పిల్లలు చనిపోయారని వారంతా ఎంతో పశ్చాత్తాప పడ్డారు. పిల్లల ప్రేమను అర్థం చేసుకోలేకపోయామని అప్పుడు అనుకున్నారు. అందుకే వారి చివరి కోరికను తీర్చాలని అనుకున్నారు. ఆ ప్రేమ జంట విగ్రహాలను తయారు చేయించి వాటికి పెళ్లి చేయాలని భావించారు. దీంతో వారి బంధువులు అంతా కలిసి వారి విగ్రహాలను తయారు చేయించారు.
గ్రామ పెద్దలు, బాధితుల కుటుంబ సభ్యులు అందరూ కలిసి గణేశ్‌, రంజన విగ్రహాలకు జనవరి 14న సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. బంధువులంతా ఈ తంతుకు హాజరై వారిని దీవించారు. దీంతో చనిపోయిన ప్రేమ జంట ఏడాది తర్వాత ఇలా విగ్రహాల రూపంలో ఒక్కటైంది.
వారి ఆత్మలకు శాంతి కలగాలనే తాము ఈ పని చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇప్పుడా వార్త చుట్టుపక్కన వైరల్‌గా మారింది..ఈ పని ఏదో వాళ్లు బతికి ఉన్నప్పుడే చేసి ఉంటే..పిల్లల ప్రాణాలు పోయేవి కాదు కదా అని అందరూ అనుకుంటున్నారు.. నిజానికి వాళ్లు చెప్పింది కూడా కరెక్టే కదా..! పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లిళ్లుమాత్రం నిక్కచ్చిగా ఉన్నాయా..లేవు కదా..? మరి ఎందుకు ప్రేమ పెళ్లి అనగానే పెద్దవాళ్లు ఇలా ససేమీరా అంటారో.. చాలవరకూ తల్లిదండ్రులు మారారు.. వాళ్లు సుఖంగా, సంతోషంగా ఉంటే చాలు.. ఏ కులం అయితే ఏంటి పిల్లలకు నచ్చితే చాలు అనుకుంటున్నారు. ఇదే మంచి ఆలోచన.. వద్దేనందుకు కారణాలు వెతుక్కునేకన్నా.. వాళ్లు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లనే కారణాలు అడగండి.. జీవితంలో కష్టసుఖాలను కలిసిపంచుకోగలమని నమ్మకం వారికి ఉన్నప్పుడు పెళ్లి చేయడమే మంచిది.! ఏమంటారు..

Read more RELATED
Recommended to you

Latest news