రూ.1కే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడంతో ఈసారి కూడా కేవలం రూ.1 కే వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో చేపట్టనుంది.
కేవలం రూ.1కే అంత్యక్రియలు నిర్వహించే అంతిమ యాత్ర – ఆఖరి సఫర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ప్రశంసలను కూడా ఇదివరకే పొందిన విషయం విదితమే. ఈ కార్యక్రమం అంత్యక్రియలను చేయలేని పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన కరీంనగర్ నగర పాలక సంస్థను కొనియాడారు. అయితే ఇప్పుడు అదే నగర పాలక సంస్థ మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది.
రూ.1కే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడంతో ఈసారి కూడా కేవలం రూ.1 కే వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో చేపట్టనుంది. ఇందులో భాగంగా ఒక డాక్టర్, ఒక ల్యాబ్ టెక్నిషియన్ కార్పొరేషన్ ఆవరణలోనే ఒక హెల్త్ సెంటర్‌లో పనిచేస్తారు. వారు ఒక్క రూపాయికే రక్త, మూత్ర, బీపీ పరీక్షలు చేస్తారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహకారం తీసుకోనున్నారు.
అలాగే పాత చెప్పులు, బూట్లను సేకరించి వాటికి మరమ్మత్తులు చేసి పేదలకు అందించే విధంగా బూట్ హౌస్ పథకాన్ని కూడా ఈ కార్పొరేషన్ వారు త్వరలో అక్కడ అమలు చేయనున్నారు. అందుకు గాను కళాభారతి ఆవరణలో ఓ షెడ్డును కూడా త్వరలో నిర్మించనున్నారు. ఇక కమ్యూనిటీ హాళ్లను ఎంపిక చేయడంతోపాటు వాటిల్లో 4 రీడింగ్ రూములను ఏర్పాటు చేస్తామని, వాటిల్లో ఒకటి మహిళలకు కేటాయిస్తామని కార్పొరేషన్ తెలిపింది. అలాగే నైట్ షెల్టర్ల ద్వారా అనాథలు, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తామని, వారికి రెండు పూటలా భోజనం, పడక, ఫ్యాన్లను ఏర్పాటు చేస్తామని కూడా కార్పొరేషన్ తెలిపింది. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు. మరి ఈ కార్యక్రమాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చూడాలి.