అమ్మకు వందనం.. కరోనా కాలంలో కొడుకు కోసం 700 కి.మీ దూరం వచ్చి..

-

అమ్మను మించిన దైవం లేదు.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. అమ్మ ప్రేమ అలాంటిది మరి.. తల్లి ప్రేమను మించిన ప్రేమ మనకు ఎక్కడ వెతికినా దొరకదు. అమ్మ మనకోసం చేసే త్యాగాలు అన్నీ ఇన్నీ కావు.. తల్లి ప్రేమను వర్ణించడానికి పదాలు సరిపోవు.. . అది అనుభవిస్తే వచ్చే ఓ తియ్యని వరం. ఈ కరోనా కాలంలో ఒక తల్లి చూపిన తెగువ అమ్మ ప్రేమ విలువను చాటింది.. రజియాబేగం అనే ఒక తల్లి తన కొడుకు కోసం ప్రాణాలకు తెగించారు. ఏకంగా కొడుకు ప్రాణాల కోసం 700 కిలోమీటర్లు స్కూటి మీద వెళ్ళడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన తెలంగాణా లో చోటు చేసుకుంది.

ఆమె పేరు రజియాబేగం… గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. ఆమె భర్త 12 ఏళ్ళ క్రితం ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. తానే పిల్లలను పెంచి పోషిస్తున్నారు. భర్త చనిపోయిన నాటి నుంచి తల్లి ఆమె తండ్రి ఆమె. ఆమె ఇద్దరు కుమారుల్లో రెండో కుమారుడు మహ్మద్‌ నిజాముద్దీన్‌ ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్‌ అకాడమీలో ప్రస్తుతం కోచింగ్‌ తీసుకుంటున్నాడు.

ఇక అతనికి నెల్లూరులో స్నేహితుడు ఉన్నాడు. అతను బోధన్ లో ఇంటర్ వరకు చదవగా… అతడు ఇంటర్ లో ఫెయిల్ అవ్వగా సప్లమెంటరీ పరీక్షల కోసం వీరు ఇద్దరూ హైదరాబాద్ కి మార్చ్ లో వచ్చారు. అయితే మహ్మద్ స్నేహితుడి తండ్రి… ఆరోగ్య౦ క్షీణించింది అనే విషయం తెలియడంతో వెంటనే మహ్మద్ అతని వెంట కలిసి నెల్లూరు వెళ్ళాడు. మార్చ్ 12 న నెల్లూరు వెళ్ళారు ఇద్దరూ.

అయితే అనూహ్యంగా కరోనా ప్రభావం తో లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో బోధన్ వెళ్ళలేదు. దీనితో రజియా బెగంలో ఆందోళన మొదలయింది. దానికి తోడు నెల్లూరు లో 50 కరోనా కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డికి వివరించారు. ఆయన తన కుమారుడ్ని తీసుకుని రావడానికి గానూ ఒక లెటర్ ఇచ్చారు. వెంటనే సోమవారం ఉదయం ఆమె తన బండి మీద… 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు వెళ్ళారు.

అక్కడి నుంచి ఆలస్యం చేయకుండా కాస్త విశ్రాంతి తీసుకుని తన కొడుకుని ఎక్కించుకుని వచ్చేశారు ఆమె. అంటే మూడు రోజుల వ్యవధిలో తన కొడుకు కోసం ద్విచక్ర వాహనం మీద ఆమె 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసారు. మధ్యలో అటవీ ప్రాంతం కూడా ఉన్నా సరే ఆమెకు తన కొడుకు మాత్రమే కనిపించాడు. కొడుకుని వెంటనే ఇక్కడికి తీసుకుని రావాలని తపించి ఆమె కొడుకుని తీసుకొచ్చారు.

ఈ ఘటనపై ఆమె కామారెడ్డి లో మీడియాతో మాట్లాడారు. కొడుకుని చూడాలి అనే తపన తనను అంత దూరం ప్రయాణించే విధంగా చేసిందని… అటవీ ప్రాంతంలో వెళ్ళినా సరే తనకు భయం వేయలేదని… దారిలో ఏపీ పోలీసులు ఆపినా సరే బోధన్ ఏసీపీ ఇచ్చిన లెటర్ చూపించడం తో తనను అనుమతించారని ఆమె పేర్కొన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే తల్లి ప్రేమ ఆ స్థాయిలో ఉంటుంది. ఆమెకు మనలోకం అభినందనలు చెప్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news