విజయ మంత్రమైన సంకల్పాన్ని సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..

విజయం అందుకోవడానికి కావాల్సిన అన్ని మంత్రాల్లో కెల్లా అతి ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది సంకల్ప మంత్రమే అని చెప్పాలి. అవును, గొప్ప స్థాయికి వెళ్ళిన చాలా మంది కంటే ఎక్కువ తెలివి తేటలున్నా కూడా వాళ్ళెంచుకున్న రంగంలో విజయం అందుకోలేకపోవడానికి ఏదైనా కారణం ఉందంటే, అది సంకల్పం లేకపోవడమే. ఒక పని మీద శ్రద్ధ చూపకపోవడం. నూటికి నూరు శాతం దానిమీద పని చేయకపోవడం. విజయం సాధించాలంటే అది ఇది కావాలి అని చెప్పే వాళ్ళు, మొదట సంకల్పం కావాలని చెప్పాలి.

సంకల్పం ఉంటే అదే వారిని విజయ తీరాలకి దారితీస్తుంది. మరి ఈ సంకల్పాన్ని సాధించాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

మీ లక్ష్యం పెద్దదైనపుడు చిన్నపాటి అసౌకర్యాలు కామన్. కోరికలు పెద్దగా ఉన్నప్పుడు దార్లో వచ్చే చిన్న చిన్న వాటి గురించి ఆలోచించవద్దు. చిన్న చిన్న కోరికలను జయిస్తే పెద్ద వాటికి దగ్గర అవుతారు. అలా అని మనసు చంపేసుకోమని కాదు. మీ లక్ష్యాన్ని ఇబ్బంది పెట్టే వాటికి దూరంగా ఉండడమే మంచిదని అర్థం చేసుకోండి.

మీ భావోద్వేగాలను మీ వాదనలతో సమతుల్యం చేసుకోండి. ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకుంటే మీ లక్ష్యాలను తొందరగా చేరుకోగలరు.

మీరేం సాధించాలనుకున్నా ముందు దాన్నొక పేపర్ మీద రాయండి. మనసులో ఉన్న వంద ఆలోచనల్లో అది పక్కకి వెళ్ళకుండా ఉండాలంటే దాన్ని పేపర్ మీద పెట్టడమే మంచిది. అది మీకొక దారి చూపిస్తుంది. ఎలా వెళ్ళాలనే దాని మీద మీకు స్పష్టత వస్తుంది.

కొన్ని కొన్ని సార్లు మీ లక్ష్యాలను చేరుకోలేమో అన్న అనుమానం మీకే రావచ్చు. వయ్సైపోతుందన్న భావనో, మరింకోటో మిమ్మల్ని, మీలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయవచ్చు. అలాంటి సమయంలో మీకు మీరు శక్తిని ఇచ్చుకోవాలి. ఈ ప్రపంచంలో చాలా మంది చాలా విజయాలను చాలా అవరోధాలను అడ్డుకుని మరీ గెలుచుకున్నారు.