Athira Preeta Rani : ఆమె ఆసక్తి ఆకాశం అంచులు దాటింది.. లక్ష్యం అంతరిక్షం అయింది..

ఆరేళ్ల వయసులో నాన్న కొనిచ్చిన విమానం బొమ్మ ఆమెకు ఆకాశంలో ఎగరాలనే కలను తెచ్చింది. అప్పటి నుంచి ఆటలూ విమానాలు, రాకెట్లు వంటి బొమ్మలతోనే. క్రమేపీ తన ఆసక్తి ఆకాశం అంచులు దాటింది. ఇప్పుడుతను ప్రపంచ వ్యాప్తంగా వేల మందితో పోటీ పడి రోదసి యాత్ర శిక్షణకు అర్హత సాధించింది. 24 ఏళ్ల ఈ అమ్మాయి గురించి చదివాక తను అంతరిక్షంలోకి వెళ్లి తీరుతుందని మీరూ అంటారు..

అథిరా వాళ్ల నాన్న వేణు, అమ్మ ప్రీతకు తనను డాక్టర్‌ను చేయాలని కోరిక. అథిరకేమో అంతరిక్షం పిచ్చి. వాళ్లది కేరళలోని తిరువనంతపురం. అక్కడ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియంలో ఔత్సాహిక అంతరిక్ష పరిశోధకులను ప్రోత్సహించేందుకు ‘ఆస్ట్రోనామికల్‌ సొసైటీ’ ప్రారంభమైంది. హైస్కూల్‌లో ఉన్నప్పుడే అథిర తరచూ వెళ్లి అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తల ప్రసంగాలు వింటూండేది.

అంతరిక్షం గురించి పుస్తకాలెన్నో చదివేది. ఇస్రో నిర్వహించిన ‘నేషనల్‌ స్పేస్‌ ఒలంపియాడ్‌ అండ్‌ స్పేస్‌ క్విజ్‌’లో విజేతగా నిలిచింది. ఇంటర్‌ పూర్తయ్యాక వైద్యవిద్య  చదవాలని అమ్మా నాన్నలు ఒత్తిడి చేశారు. ఇక అక్కడుంటే తన కల నెరవేరదనుకొంది. వాళ్లను బతిమాలీ, బామాలీ 2018లో కెనడా అల్గోనిక్విన్‌ కాలేజీలో రోబోటిక్స్‌ చదవడానికి వెళ్లింది. అప్పటికి తనకు 19 ఏళ్లు. పైలట్‌ కోర్సు కూడా చేయాలనుకుంది. కానీ తనకొచ్చే ఉపకార వేతనం కాలేజీ చదువుకు సరిపోయేది. మరెలా? అందుకే పార్ట్‌టైం ఉద్యోగాలు చేసేది. ఆ సొమ్ముతో డిగ్రీ పూర్తయ్యే సరికి ఫ్లైయింగ్‌ స్కూల్‌లో చేరి, పైలట్‌గా లైసెన్స్‌ సాధించింది.

అంతకు ముందు ఆస్ట్రోనామికల్‌ సొసైటీలో ప్రసంగాలు వినడానికి వెళ్లినప్పుడు అక్కడికి ఇస్రో జీఎస్‌ఎల్వీ ప్రాజెక్ట్‌ శాస్త్రవేత్త గోకుల్‌దాస్‌ బాలచంద్రన్‌ కూడా వస్తుండేవారు. ఆయనతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో ఇద్దరూ ఏడడుగులు నడిచారు. ఇద్దరూ కలిసి కెనడాలో అంతరిక్ష పరిశోధన, పరికరాల తయారీ కోసం గతేడాది ‘ఎక్సో జియో ఏరోస్పేస్‌’ స్టార్టప్‌ ప్రారంభించారు. అంతరిక్షంలో వ్యర్థాలను శుభ్రపరిచేందుకు ‘ప్రాజెక్ట్‌ ఈగల్‌ మిషన్‌’ పేరుతో ఉపగ్రహాల తయారీ ఈ సంస్థ లక్ష్యం.

తన లక్ష్యం ఇది కాదు కదా అంటారా.. అవును. అథిరా కూడా దాన్ని మర్చిపోలేదు. తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నాసా, కెనడా స్పేస్‌ ఏజన్సీ, నేషనల్‌ రీసెర్చి కౌన్సిల్‌ ఆఫ్‌ కెనడా సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పోటీ పెట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. వారికి శిక్షణ కూడా ఇస్తాయి. అందులోంచీ మళ్లీ పరీక్షలు నిర్వహించి కొందరిని అంతరిక్ష యాత్రకు పంపుతాయి. అథిర ఈ శిక్షణలో స్థానాన్ని సంపాదించాలనుకుంది. సొంత సంస్థ పనులను చూసుకుంటూనే, ఈ పరీక్షలకు సిద్ధమయింది. అత్యంత కఠినమైన వడపోతలను దాటి శిక్షణకు ఎంపికైంది.

‘ఇందులో చేరడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. ఎన్నో వడపోతల తర్వాత 12 మంది ఈ శిక్షణకు అర్హత పొందారు. మనదేశం నుంచి నేను ఒక్కదాన్నే ఎంపికయ్యా. ఇక్కడ మూడు నుంచి అయిదేళ్లు శిక్షణ ఇస్తారు. దాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తారు. ఆ జాబితాలోనూ స్థానాన్ని సంపాదించగలిగితే నా కలను సాకారం చేసుకున్నట్లే. కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌ వంటి ప్రముఖల పేర్ల పక్కన నా పేరూ చేరుతుంది. అదీ సాధించి మన దేశానికి గొప్ప పేరు తేవాలన్నది నా లక్ష్యం’ అంటోంది అథిర ప్రీతారాణి.