స్వామి అగ్నివేష్ జీవితం.. విశేషాలు..

సామాజిక కార్యకర్త, ఆర్య సమాజం నాయకుడు స్వామి అగ్నివేష్ శుక్రవారం సాయంత్రం చివరి శ్వాస విడిచారు. సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలందించిన స్వామి అగ్నివేష్, తెలుగువారు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలో 1939వ సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తేదీన జన్మించారు. ఐతే ఆర్యసమాజంలోకి వెళ్ళిన తర్వాత తనపేరు, కులం, కుటుంబం అన్నింటినీ వదిలేసి సన్యాసిగా మారాడు.

స్వామి అగ్నివేష్ అసలు పేరు వేపా శ్యామ్ రావ్. స్వామి అగ్నివేష్ గా మారిన తర్వాత పూర్తిగా సమాజ సేవకే అంకితమయ్యారు. ఆయన చేపట్టిన వెట్టిచాకిరి నిర్మూలన ఉద్యమం సంచలనం రేపింది. వెట్టిచాకిరి విముక్తి వేదికని స్థాపించి, వెట్టిచాకిరి నిర్మూలనకై ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన చేసిన సామాజిక సేవ రాజకీయాల్లోకి దింపింది. ఆర్యసభ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన అగ్నివేష్, ఆ తర్వాత 1977లో జనతా పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసారు.

మంత్రిగా పనిచేసిన రెండేళ్లకే ఆ పదవికి రాజీనామా చేసారు. తమ ప్రభుత్వ పోలీసులు వెట్టిచాకిరిపీ పోరాడుతున్న వారిని లాఠీచార్జీ జరిపితే దానిపై న్యాయ విచారణ జరిపాలని డిమాండ్ చేసారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి సరైన స్పందన రానందున మంత్రి పదవిని కాదనుకుని బయటకి వచ్చేసారు. ఆయన చేయని పోరాటం లేదు. సతీసహగమనాని వ్యతిరేకించారు, మద్యపానాని నిషేధించాలని పోరాటం జరిపారు. స్త్రీల హక్కుల కోసం పోరాడారు.

అంతర్జాతీయ ఆర్యసమాజ మండలికి 2004 నుండి 2014 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. అన్నాహజారే చేపట్టిన ఉద్యమంలో పాలు పంచుకొన్నారు. సమాజంలో అసమానతలు ఉన్నాయని పేదవారిని సమాజం సమానంగా చూడదని ఫైవ్ స్టార్ హోటల్ లోకి పేదలను తీసుకెళ్ళే ప్రయత్నం చేసి ప్రాక్టికల్ గా చూపించారు. ఐతే ఈయనపై హిందూ వ్యతిరేకి అన్నవిమర్శలు కూడా వచ్చాయి.

అచ్చమైన కాషాయ వస్త్రాధారిగా కనిపించే స్వామి అగ్నివేష్ పై ఇలాంటి విమర్శలు రావడం విచిత్రమే. 2018లో ఝార్ఖండ్ లోని పాకూర్ ప్రాంతంలో స్వామి అగ్నివేష్ పై దాడి జరిగింది.

గత కొన్ని రోజులుగా లివర్ సిరోసిస్ తో బాధపడుతున్న స్వామి అగ్నివేష్, నిన్న సాయంత్రం పరమపదించారు.