టెన్త్‌, ఇంట‌ర్, డిగ్రీల్లో ఈయ‌న‌కు వచ్చిన మార్కులు త‌క్కువే.. కానీ ఐఏఎస్ అయ్యారు..!

ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ‌డం అంటే ఆషామాషీ ఏమీ కాదు. అందుకు ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌ద‌వాల్సి ఉంటుంది. ఒక‌సారి ర్యాంక్ రాక‌పోతే మ‌ళ్లీ మళ్లీ ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది. కొంద‌రికి మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్ వ‌స్తుంది. వారు ఐఏఎస్ అవుతారు. కానీ కొంద‌రికి కొన్ని ప్ర‌య‌త్నాలు అవ‌స‌రం అవుతాయి. ఇలా స‌క్సెస్ సాధించిన ఐఏఎస్‌లు చాలా మందే ఉన్నారు. అయితే ఆయ‌న మాత్రం కొంచెం ఇందుకు భిన్నం. ఎందుకంటే..

చ‌త్తీస్‌గ‌డ్ క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ‌నీష్ శ‌ర‌న్ 2009లో ఐఏఎస్ అయ్యారు. అయితే ఆయ‌న‌కు చెందిన ఓ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆయ‌న‌కు 10వ త‌ర‌గతిలో 44 శాతం మార్కులు వ‌చ్చాయ‌ని, ఇంట‌ర్‌లో 65 శాతం, డిగ్రీలో 60 శాతం మార్కులే వ‌చ్చాయ‌ని, ఆయ‌న ఒక బిలో యావ‌రేజ్ స్టూడెంట్ అయి ఉండి కూడా కష్ట‌ప‌డి చ‌దివి సివిల్స్ లో ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అయ్యార‌ని.. ఒక పోస్టు వైర‌ల్ అవుతోంది.

అయితే ఆ పోస్టుపై అవ‌నీష్ స్వ‌యంగా స్పందించారు. త‌న‌కు ఆ మార్కులు వ‌చ్చిన మాట నిజ‌మే అని, అవి త‌న‌కు వ‌చ్చాయ‌ని తెలిపారు. అయితే ఆ మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చ‌ద‌వ‌డం మానొద్ద‌ని, క‌ష్ట‌ప‌డి చ‌ద‌వాల్సిందేన‌న్నారు. చ‌దువుకు ఆ మార్కులు ఒక ఎక్స్‌క్యూజ్ కాద‌ని, ఎవ‌రైనా సరే క‌ష్ట‌ప‌డి చ‌దివితేనే సివిల్స్‌లో పాస్ అవుతార‌ని తెలిపారు. కాగా అవ‌నీష్ ఐఏఎస్‌గా ప‌నిచేస్తూనే సివిల్స్ రాసే వారికి విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తుంటారు. 10, ఇంట‌ర్‌, డిగ్రీల‌లో ఎన్ని మార్కులు వ‌చ్చినా స‌రే ఆ మార్కులు సివిల్స్‌కు స‌రిపోవు. అది వేరే. ఐఏఎస్ సాధించాలంటే స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన దానికి కొన్ని రెట్లు ఎక్కువ‌గా చ‌ద‌వాల్సి ఉంటుంది. అలా చ‌దివితేనే సివిల్స్ సాధిస్తారు. కానీ త‌క్కువ మార్కుల‌ను ఒక సాకుగా చూపించ‌రాదు. ఆ విష‌య‌మే ఆయ‌న చెప్పారు.