ఓ వైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు కుటుంబ పోషణ.. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఖర్చులు.. పిల్లల చదువులు.. వెరసి సగటు పౌరుడికి ప్రస్తుతం బతుకు బండిని ఈడ్చడం కష్టంగా మారింది. దీంతో కుటుంబంలో భర్తతోపాటు భార్య కూడా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కొందరు అతివలు మాత్రం కుటుంబ భారాన్ని మోసేందుకు ఎలాంటి కష్టం పడేందుకు అయినా వెనుకాడడం లేదు. అవును.. ఆమె కూడా సరిగ్గా అలాగే చేస్తోంది.
కొత్తగూడెంకు చెందిన యేదలపల్లి ఆదిలక్ష్మి భర్త వీరభద్రంతో కలిసి అక్కడి సుజాతనగర్లో నివాసం ఉంటోంది. వీరిది అంజనాపురం. బ్రతుకు దెరువు నిమిత్తం సుజాతనగర్లో సెటిల్ అయ్యారు. 2010లో వీరికి వివాహం కాగా కొంతకాలం వరకు టేకులపల్లిలో ఉన్నారు. తరువాత సుజాత నగర్‌కు వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే వీరభద్రం తన అత్తవారు ఇచ్చిన కొంత స్థలాన్ని తాకట్టుగా పెట్టి అక్కడ రూ.1 లక్ష ఖర్చుతో టైర్ వల్కనైజింగ్, వెల్డింగ్ షాప్‌ను పెట్టాడు. కానీ అందులో అతను ఒక్కడికి పనిభారం ఎక్కువైంది. దీనికి తోడు వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. ఈ క్రమంలో ఆదిలక్ష్మి కూడా తన భర్తతో కలిసి పనిచేయడం ప్రారంభించింది.
మొదట్లో టైర్ వర్క్ చేసేందుకు ఆమెకు కష్టం అయింది. కానీ తరువాత అదే అలవాటు అయింది. ఇప్పుడు ఆమె ఎంత పెద్ద ట్రక్కులకు చెందిన టైర్లను అయినా సరే సులభంగా తీయగలదు. ఒక్కతే పనంతా చేయగలదు. టైర్లను ఎక్కించగలదు. దీంతో ప్రస్తుతం వారికి ఆదాయం కూడా పెరిగింది. అలా కొన్నేళ్లుగా ఆదిలక్ష్మి ఈ పనిచేస్తోంది. వారి షాపు రోజుకు 24 గంటలూ ఓపెన్ ఉంటుంది. సాధారణంగా ఈ పని చేయడం పురుషులకే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆమె ఈ పనిచేస్తుందంటే నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.