ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తది. అవును, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అనుకున్న చాలా మంది ఆ తర్వాత జీవితం పెట్టిన పరీక్షలో ఇబ్బందిపడ్డవాళ్ళే. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క క్షణం చాలు జీవితమంతా తలకిందులు అవ్వడానికి. అప్పటి వరకూ ఉన్న సంతోషమంతా గాల్లో కలిసిపోయి, ఎంత వదిలిపెడదామనుకున్నా బంకలా అతుక్కుపోయే బాధలు వచ్చేస్తాయి.
మరి ఇలాంటి జీవితంలో కొన్ని విషయాలని తొందరగా గ్రహిస్తే జీవితాన్ని మరింత ఆనందంగా గడపవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవిత వాస్తవం అనేది కాలేజీ లైఫ్ తర్వాతే ప్రారంభమవుతుంది. కాలేజీలో ఉన్నప్పుడు అంతా ఒక భ్రమలో ఉంటారు. బయటకొచ్చాకే అసలు జీవితం కనిపిస్తుంది.
జీవితంలో అత్యంత సుందరమైన దశ ఏదైనా ఉందంటే అది పాఠశాల మాత్రమే. మీ పిల్లలకి ఈ విషయాన్ని తొందరగా చెప్పండి. వారి జీవితంలో అత్యంత అద్భుతమైన దశని కేవలం చదువుతోనే గడిపివేయకుండా చూడాల్సిన బాధ్యత మీదే.
ప్రపంచం పరుగులు పెడుతుంది. నువ్వు కూడా ఆ వేగాన్ని అందుకోవాలి. లేదంటే పరుగులో వెనకబడిపోయి నిరుద్యోగిగా మిగిలిపోతావు.
నువ్వు అత్యంత ధనవంతుడిగా మారాలంటే ఇప్పటి కంటే ఎక్కువ కష్టం చేయాలి. కృషి చేయకుండా ఏదీ రాదు. పని మీద ఆసక్తి లేకపోతే నీ జీవితం అడుగు కూడా ముందుకు పడదు.
జీవితంలో విజయం పొందాలంటే నీ మీద నువ్వే ఆధారపడాల్సి ఉంటుంది. అవతలి వారి మీద భారం వేసి విజయం వరించట్లేదని అనుకోకు.
నీ వైఫల్యాలలో నీతో పాటు ఉండేది చాలా కొద్ది మంది మాత్రమే. ఒక్కోసారి నీ అనుకున్న నీ భార్యా పిల్లలు కూడా నీతో ఉండకపోవచ్చు. ఈ విషయం ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ఉండు. ఎందుకంటే వైఫల్యం వచ్చినపుడు ఒక్కొక్కరు నిన్ను విడిచి వెళ్తుంటే ఆ బాధ కొలిమిలో కాలుతున్న ఇనుములా ఉంటుంది.