ఐపీఎల్‌ వేదికల రగడ కొత్త మలుపు తిరుగుతుందా ?

-

రానున్న ఐపీఎల్‌ను ఆరు వేదికల్లోనే నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయంపై రచ్చ కొనసాగుతోంది. ఇప్పటికే, దీనిపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేయగా..ఇప్పుడు మూడు ఫ్రాంచైజీలు సైతం తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సొంతగడ్డపై మ్యాచ్‌లు లేకపోతే స్థానిక అనుకూలత దూరమవుతుందని ఆందోళన తెలుపుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచించాలంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలిని కోరుతున్నాయి.

ఐపీఎల్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. పొట్టి క్రికెట్‌ సంబరం..ఈ మ్యాచ్‌ల కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా దుబాయ్‌కి వెళ్లిన ఐపీఎల్‌.. ఈ ఏడాది కూడా కొన్ని నగరాల్లో మ్యాచ్‌లు అనుమానమే అన్న వార్తలు సంచలనంగా మారాయి. ఆరు వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న బీసీసీఐ ప్రపోజల్స్‌.. హాట్‌ టాపిక్‌గా మారాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తామనడంపై విమర్శల పెరుగుతున్నాయి.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు బీసీసీఐ ఆ రాష్ట్రంలో మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్‌ లేదని చెబుతున్నారు. ముంబైతో పాటు, పుణేలోనూ మ్యాచ్‌లు అనుమానమే అంటున్నారు. ఈ స్థానంలో హైదరాబాద్‌ పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ముదురుతోంది ఇప్పటికే హైదరాబాద్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేయగా.. ఇప్పుడు పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ కూడా తమ దగ్గర మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐను కోరారు.

బీసీసీఐ మాత్రం మూడు ఫ్రాంచైజీలను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది. కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా తాము నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఫ్రాంచైజీలకు చెబుతోంది. ఇప్పుడు 5 జట్లు సొంతగడ్డపై ఆడటం తమ అవకాశాల్ని ప్రభావితం చేస్తాయని ఆందోళన చెందుతున్నాయి. బోర్డు నిర్ణయంతో క్రికెటే కాకుండా వ్యాపార పరంగానూ తమకు నష్టమేనంటున్నాయి. అయితే, వేదికల ఎంపికపై బీసీసీఐ.. తన పని తాను చేసుకుపోతోంది. ఈ నెలాఖరులోపు వేదికల్ని ప్రకటిస్తామని ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందించింది. మరి అసంతృప్తిగా ఉన్న ఫ్రాంచైజీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news