విప్రోలో సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే మాటలేమీ కాదు. అది మంచి జాబ్. దాన్ని ఎవరైనా వదులుకుంటారా? అటువంటి మల్టీనేషన్ కంపెనీలో పనిచేయాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ.. ఓ యువకుడు మాత్రం ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. 9 టు 5 జాబ్‌ను వదిలేసి.. స్వయం ఉపాధిలో విజయం సాధించి ఆదర్శంగా నిలిచాడు. అతడే శివసాయి చరణ్. ఊరు ఏపీలోని అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ.
అందరిలా కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా, వినూత్నంగా ఆలోచించి ముందడుగేశాడు చరణ్. జాబ్‌కు రిజైన్ చేసి ఊరికి వచ్చాడు. తన వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించి.. నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. తన కొత్త కొత్త ఆలోచనలతో.. వినూత్నంగా నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించి ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు. ప్రస్తుత తరుణంలో నాటుకోళ్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించే వాటి పెంపకానికి శ్రీకారం చుట్టినట్టు చరణ్ తెలిపాడు. కేవలం 20 లక్షల పెట్టుబడితో ఇప్పుడు లాభాలు గడించడమే కాదు.. 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు.
నాటుకోళ్ల వ్యాపారం ఎలా ప్రారంభమయింది..
తమిళనాడులోని సేలం నుంచి ముందుగా 2 వేల కోడి పిల్లలను తీసుకొచ్చాడు. వాటిని పెంచడం ప్రారంభించాడు. వాటిని కొనడం, పెంచడం కోసం 4 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు చరణ్. నాలుగు నెలల పాటు వాటిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. వాటిని అమ్మగా… పెట్టుబడి పోను.. 2 లక్షల రూపాయలు మిగిలాయి చరణ్‌కు. అలా… తన నాటుకోళ్ల పెంపకానికి నాంది పడింది.
కోళ్లపెంపకంతో పాటు వ్యవసాయంపై కూడా చరణ్‌కు మక్కువ ఎక్కువే. తన పొలంలో సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాలను పండించడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నాడు చరణ్. ఓవైపు కోళ్లపెంపకం.. మరోవైపు వినూత్న పద్ధతిలో.. సహజ సిద్ధంగా చిరుధాన్యాలు కూడా పండిస్తుండటంతో ఆ ప్రాంత వాసులు చరణ్‌ను చూసి తెగ మెచ్చుకుంటున్నారట. వ్యవసాయం అంటేనే ఏం తెలియని వ్యక్తి ఇలా ఊరికి వచ్చి పది మందికి ఉపాధి కల్పించి.. వినూత్నంగా ఆలోచిస్తూ.. లాభాలు గడిస్తుండటంతో అక్కడి వాళ్లు సంతోషపడుతున్నారట.