హైదరాబాద్ నగరవాసులకు లభించే ప్యారడైజ్ బిర్యానీ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు హైదరాబాద్‌కు వస్తే చాలు.. ఎవరైనా ప్యారడైజ్‌లో బిర్యానీ తిని వెళ్లాలనే అనుకుంటారు. అంతగా ఆ రెస్టారెంట్ పాపులర్ అయింది. ఎన్నో ఏళ్లుగా నగరవాసులకు కమ్మటి బిర్యానీ రుచులను ఈ రెస్టారెంట్ అందిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఇదే రెస్టారెంట్ ఓ ప్రత్యేక ఘనతను సాధించింది. ఏడాదిలో ఎక్కువగా బిర్యానీలను అమ్మినందుకు గాను ప్యారడైజ్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది.
హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్‌లో ఉన్న ప్యారడైజ్ రెస్టారెంట్ 2017లో 70 లక్షలకు పైగా బిర్యానీలను సర్వ్ చేసిందట. దీంతో ప్యారడైజ్ రెస్టారెంట్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించారు. ఇక ఇదే అవార్డుతోపాటు ప్యారడైజ్‌కు బెస్ట్ బిర్యానీ అవార్డు కూడా దక్కింది. ప్యారడైజ్ చైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో సిబ్బంది కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
కాగా ప్రస్తుతం ప్యారడైజ్‌కు దేశవ్యాప్తంగా 37 బ్రాంచిలు ఉండగా, ఇతర దేశాల్లోనూ తమ రెస్టారెంట్లను ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. నాణ్యత, వినియోగదారుల నమ్మకమే తమకు ఈ ఘనతను తెచ్చి పెట్టాయని వారు తెలిపారు. కాగా 2017 జనవరి 1 నుంచి అదే ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు ప్యారడైజ్ హోటల్‌లో 70,44,289 బిర్యానీలను అమ్మారట. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఇన్ని బిర్యానీలు అమ్మడం రికార్డ్ అని రెస్టారెంట్ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో ఒక రోజుకు 19,352 బిర్యానీలు, గంటకు 806 బిర్యానీలు, నిమిషానికి 13 బిర్యానీలు అమ్మినట్లు లెక్క వస్తుంది. ఏది ఏమైనా.. అన్ని బిర్యానీలు అమ్మడం అంటే మాటలు కాదు కదా..!