మరో రెండు, మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలోని రాజకీయ పార్టీలు ఇప్పటికే పొత్తుల ప్రక్రియను, అభ్యర్థుల ఎంపికను ప్రారంభించేశాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల్లోనూ ఎన్నికల వేడి రాజుకుంటోంది. కాగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే, శివసేన, ఎస్పీ, బీఎస్పీలు ఇప్పటికే కూటములుగా నిర్మాణమయ్యాయి. దీంతో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీల గెలుపు ఓటముల మాట అటుంచితే.. ఈ సారి జరగనున్న ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్లుగా మారాయి. ఈ క్రమంలోనే ఈసారి ఇద్దరిలో ఎవరు ప్రధాని పీఠం ఎక్కుతారోనని చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఓ ప్రముఖ న్యూస్ చానల్ గ్రూప్ చేసిన సర్వే ప్రకారం.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోడీ మరోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తారని తెలిసింది.
టైమ్స్ గ్రూప్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం… దేశంలో 84 శాతం మంది ప్రజలు మళ్లీ మోడీనే ప్రధానిగా కోరుకుంటున్నారట. ఇక ఈ సర్వేలో రెండో స్థానంలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఈయన ప్రధాని కావాలని కేవలం 8.33 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారట. అలాగే తరువాతి స్థానాల్లో వరుసగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (1.44 శాతం), బీఎస్పీ అధినేత్రి మాయావతి (0.43 శాతం)లు నిలిచారు. ఈ నెల 11వ తేదీ నుంచి నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 9 భాషల్లో టైమ్స్ గ్రూప్‌కు చెందిన మీడియా సంస్థలు ఆన్‌లైన్ సర్వే చేసి మరీ ఈ ఫలితాన్ని వెల్లడించాయి. ఈ సర్వేలో 2 లక్షల మంది పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.
ఈ క్రమంలో టైమ్స్ గ్రూప్ సర్వే ప్రకారం.. దేశంలో 84 శాతం మంది ప్రజలు మళ్లీ బీజేపీకే అధికారం ఇవ్వాలని భావిస్తున్నారట. అలాగే ఈ 5 ఏళ్ల మోడీ పాలనలో దేశంలో 80 శాతం మంది ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు తెలిసింది. మోడీ పాలన బాగాలేదని కేవలం 10 శాతం మంది మాత్రమే చెప్పారట. ఇక 2014తో పోలిస్తే రాహుల్ గాంధీకి ప్రజాదరణ పెరిగిందని, కానీ ఆయనకు ప్రజలు ఓటు వేయరని, మోడీకే ఓటు వేస్తారని సర్వేలో తేలింది. పెద్ద నోట్ల రద్దు, ఉద్యోగాలన కల్పనలో విఫలం, జీఎస్టీ వంటి పలు అంశాలు ఉన్నప్పటికీ మోడీనే మరోసారి ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరి.. ఎన్నికల్లో ప్రధానిగా మోడీ మరోసారి పీఠం ఎక్కుతారా..? వేచి చూస్తే తెలుస్తుంది..!