ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే చర్చ నడుస్తోంది. ఓ వైపు అక్కడ పోలింగ్ ముగియగా ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. వాటిల్లో ట్రంప్, బైడెన్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వార్ జరుగుతోంది. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అయితే మన దేశంలో పుట్ట గొడుగుల్లా పార్టీలు ఉన్నాయి కదా.. కానీ అమెరికాలో ఎప్పుడు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించినా కేవలం రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులే ఎందుకు పోటీ చేస్తారు ? ఇతర పార్టీలకు చెందిన వారు ఎందుకు పోటీ చేయరు ? అసలు అమెరికాలో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు తప్ప అసలు ఇతర పార్టీలు లేవా ? అంటే…
అమెరికాలో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు కాకుండా ఇతర చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. కానీ వారెప్పుడూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. పోటీ కూడా చేయరు. ఎందుకంటే అమెరికాలో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలే చాలా పెద్దవి. మెజారిటీ ప్రజలు ఆ రెండింటిలో ఏదో ఒక దాని వైపు ఉన్నారు. కనుక చిన్న పార్టీలకు ఆదరణ లేదు. అందుకని చిన్న పార్టీలు అక్కడి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవు. కానీ ఆ రెండు పెద్ద పార్టీల్లో ఏదో ఒక దానికి ఇతర పార్టీలు మద్దతునిస్తాయి. అందుకనే అమెరికాలో ఎప్పటి నుంచో కేవలం డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆ పార్టీలకు చెందిన వారే అధ్యక్ష ఎన్నికల్లో నిలబడి గెలుస్తున్నారు. ఇదీ అసలు విషయం.
కాగా డెమొక్రటిక్ పార్టీని 1792లో థామస్ జెఫర్‌సన్, జేమ్స్ మ్యాడిసన్‌లు స్థాపించారు. రిపబ్లిక్ పార్టీని 1854లో స్థాపించారు. అందువల్ల డెమొక్రటిక్ పార్టీయే చాలా పాతదని చెప్పవచ్చు. ఇక 2004 వరకు డెమొక్రటిక్ పార్టీలో రిజిస్టర్డ్ సభ్యుల సంఖ్య 72 మిలియన్లు ఉండగా, రిపబ్లికన్ పార్టీలో 2018 వరకు రిజిస్టర్డ్ సభ్యుల సంఖ్య 55 మిలియన్లుగా ఉంది.