1884లో సౌతాఫ్రికాలోని కింబర్లీ వజ్రాల గనుల్లో మొదటి సారిగా జాకబ్ డైమండ్ దొరికింది. అనంతరం ఆ వజ్రాన్ని 1887లో పాలిషింగ్, కటింగ్ కోసం అమ్‌స్టర్‌డ్యామ్‌కు తరలించారు.
కోహినూర్ వజ్రం గురించి మీకు తెలుసు కదా. ప్రపంచంలో ఆ వజ్రం చాలా విలువైంది. అంతే కాదు కట్ చేయబడిన వజ్రాల్లోనూ కోహినూర్ వజ్రమే అతి పెద్దది. అయితే నిజానికి కోహినూర్ వజ్రం కన్నా ముందే మరో వజ్రం అతి పెద్ద వజ్రంగా పేరుగాంచింది. దాని గురించి చాలా మందికి తెలియదు. ఆ వజ్రం కూడా ఇండియాదే కావడం విశేషం. కాగా ఆ వజ్రాన్ని జాకబ్ డైమండ్ అని పిలుస్తారు. ఈ క్రమంలోనే ఈ వజ్రం గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోహినూర్ వజ్రం బరువు 106 క్యారెట్లు కాగా జాకబ్ డైమండ్ బరువు 187 క్యారట్లు. దీంతో కోహినూర్ వజ్రం కన్నా జాకబ్ డైమండే పెద్ద వజ్రంగా పేరుగాంచింది. ఇక చరిత్ర తీసుకుంటే జాకబ్ డైమండ్ కు కేవలం రెండు సార్లు మాత్రమే యజమానుల మార్పు జరిగింది. ఈ డైమండ్ దీర్ఘచతురస్రాకారంలో కట్ చేయబడి 58 ముఖాలను కలిగి ఉంటుంది. 39.5 ఎంఎం పొడవు, 29.25 ఎంఎం డెప్త్ ఉంటుంది. జాకబ్ డైమండ్ ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల్లో 5వ స్థానంలో ఉండగా, దీని విలువ 150 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది.
1884లో సౌతాఫ్రికాలోని కింబర్లీ వజ్రాల గనుల్లో మొదటి సారిగా జాకబ్ డైమండ్ దొరికింది. అనంతరం ఆ వజ్రాన్ని 1887లో పాలిషింగ్, కటింగ్ కోసం అమ్‌స్టర్‌డ్యామ్‌కు తరలించారు. అంతకు ముందు ఈ వజ్రం బరువు 400 క్యారెట్లు ఉండేది. కానీ కట్ చేశాక ఈ వజ్రం బరువు 187 క్యారెట్లుగా నమోదైంది. 1891లో షిమ్లాకు చెందిన డైమండ్స్ వ్యాపారి అలెగ్జాండర్ మాల్కం జాకబ్ ఈ వజ్రాన్ని హైదరాబాద్ నిజాం ప్రభువు మహబూబ్ అలీ ఖాన్‌కు రూ.46 లక్షలకు విక్రయించాడు. దీంతో ఆ వ్యాపారి జాకబ్ పేరిట ఈ వజ్రానికి జాకబ్ డైమండ్ అని పేరు వచ్చింది.
మాల్కం జాకబ్ ఆ వజ్రాన్ని నిజాంకు విక్రయించేందుకు ముందు అచ్చం ఆ వజ్రాన్ని పోలిన డూప్లికేట్ వజ్రం (రిప్లికా)ను నిజాంకు చూపించాడట. అయితే నిజాం వజ్రంను కొనుగోలు చేశాక అసలు వజ్రం డూప్లికేట్ వజ్రం కన్నా చిన్నగా ఉందట. దీంతో జాకబ్‌కు, నిజాంకు మధ్య తీవ్రమైన గొడవ జరిగిందట. ఈ క్రమంలో నిజాం తాను ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని, వజ్రం తనకు అవసరం లేదని డిమాండ్ చేశాడట. అయితే జాకబ్ అందుకు ఒప్పుకోలేదట. దీంతో నిజాం ఆ వజ్రం ప్రాముఖ్యతను తక్కువ చేసేందుకు, దాన్ని అగౌరవపరిచేలా తన షూస్‌లో ఆ వజ్రాన్ని పెట్టుకుని తిరిగాడట.
నిజాం మహబూబ్ అలీ ఖాన్ మరణించాక ఆయన కుమారుడు, చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వజ్రాన్ని తన ఆఫీసులో పేపర్ వెయిట్‌లా చాలా కాలం పాటు ఉపయోగించాడట. 1995లో అప్పటి భారత ప్రభుత్వం ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి ఆ వజ్రాన్ని 13 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత ఆ వజ్రాన్ని ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్రాంచ్‌లో ఉంచారు. ప్రతి ఏటా ఆ జాకబ్ వజ్రాన్ని హైదరాబాద్, ఢిల్లీల్లో నేషనల్ మ్యూజియంలలో ప్రదర్శిస్తున్నారు..!