మృగశిర కార్తె రోజున చాలా మంది కోడి మాంసం లేదా చేపలను తింటుంటారు. దీంతో వాతావరణంలో జరిగే మార్పులను తట్టుకుని, వర్షాకాలంలో ఉండే చలి నుంచి రక్షణగా ఉండవచ్చని మన పెద్దలు భావిస్తుంటారు.
వర్షాకాలం ప్రారంభమవుతుందని మనకు చెప్పే కార్తె.. మృగశిర కార్తె.. రేపటి నుంచే ఈ కార్తె ప్రారంభమవుతోంది. సాధారణంగా ఈ కార్తె ప్రారంభం కాగానే రైతులు పంటలను వేసేందుకు సిద్ధమవుతుంటారు. పొలం దున్ని, విత్తనాలను, ఎరువులను సిద్ధం చేసుకుంటుంటారు. దీంతోపాటు వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇక ప్రతి ఏడాది సాధారణంగా జూన్‌లోనే మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో రెండో వారం నుంచి పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది.
ఇక మృగశిర కార్తె రోజున చాలా మంది కోడి మాంసం లేదా చేపలను తింటుంటారు. దీంతో వాతావరణంలో జరిగే మార్పులను తట్టుకుని, వర్షాకాలంలో ఉండే చలి నుంచి రక్షణగా ఉండవచ్చని మన పెద్దలు భావిస్తుంటారు. అందుకే మృగశిర కార్తె రోజున చేపలు, చికెన్‌కు మంచి గిరాకీ ఉంటుంది. ఇక ఆ రోజు చాలా మంది బెల్లం, ఇంగువలను కలిపి సేవిస్తారు. దీంతో వర్షాకాలం ఆరంభంలో వచ్చే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
అయితే మృగశిర కార్తె ఏమోగానీ ఇప్పుడు చికెన్, చేపల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా వేసవిలో చికెన్ ధరలు తగ్గుతాయి. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు సరికదా.. రేట్లు మరింత పెరిగాయి. మార్కెట్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.250 వరకు పలుకుతోంది. రేపు ఈ ధర రూ.300 అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక సాధారణ రోజుల్లో కేజీ రూ.100 నుంచి రూ.150 వరకు ఉండే సాధారణ చేపల ధరలు రేపు రూ.200 నుంచి రూ.300 పలికే అవకాశం కూడా ఉంది. ఇక నాటుకోడి, మటన్, ముఖ్యమైన చేపల ధరలను చెప్పకపోవడమే మంచిది. అంతలా రేపు మాంసాహార ధరలు ఉండనున్నాయి. అయితే మాంసాహారం ఏమోగానీ.. ఇంగువ, బెల్లంలను కలిపి మాత్రం రేపు తినండి. దాంతో శరీర రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి..!