మీరు ప్రేమించే వారికి మీపై ఆసక్తి ఉందా అని తెలుసుకోవడానికి పనికొచ్చే సంకేతాలు..

ఒకరిపై ఇష్టం కలిగి అది ప్రేమగా మారి దాన్ని అవతలి వారికి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు అడ్డుగా నిలుస్తాయి. నా ప్రేమను స్వీకరిస్తారా? నా మీద వారికి ఆసక్తి ఉందా? అనే సందేహాలు చెప్పాలా వద్దా అన్న విషయంలో సంశయాన్ని మరింత పెంచుతాయి. కొన్ని సార్లు అవతలి వారు మీపై ఆసక్తి ఉన్నట్లుగా కనిపిస్తారు. మరికొన్నిసార్లు లేనట్లుగా ఉంటారు. ఇలాంటి టైమ్ లో నిర్ణయం తీసుకోవడం అసాధ్యం.

అందువల్ల మీరు ప్రేమించే వారు మీపై ఆసక్తి చూపిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు పనికొస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

సమయానికి సమాధానం ఇవ్వకపోవడం

మీరొక మెసేజ్ చేయగానే తొందరగా స్పందించకపోవడం, ఎప్పుడు కాల్ చేసినా బిజీగా ఉన్నానని చెప్పడం, చెప్పిన సమయానికి రాకపోవడం తదితర అంశాలు మీకు కనిపిస్తే, అవతలి వారికి మీపై ఆసక్తి లేదని అర్థం చేసుకోవాలి.

మాట ప్రయత్నం చేయకపోవడం

ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సంభాషణని పొడిగించేది మేరే అయ్యుంటారు. వారు కేవలం మీరు చెప్పేది వింటుంటారు. కొన్నిసార్లు అది కూడా చేయరు. ఫోన్ పట్టుకుని అందులో నిమగ్నమైపోతారు.

మిమ్మల్ని విస్మరించడం

ఎక్కడైనా కలిసినపుడు వారి కళ్ళలో ఎలాంటి ఫీలింగ్ లేకపోవడం, లేదా అక్కడ మిమ్మల్ని పెద్దగా పట్టించుకోకపోవడం మొదలగునవన్నీ మీపై ఆసక్తి లేదన్ని తెలియపరుస్తాయి.

ఏకపక్ష ధోరణి

తన గురించి మీరు అడిగినపుడు మాత్రమే మాట్లాడతారు. అంతేగానీ మీ గురించి అడగరు. కనీసం చిన్న సలహా ఇవ్వరు. మిమ్మల్ని అడగరు కూడా. ఇలా ఒకే పక్షాన నిలబడుతూ ఉంటే మీ గురించి ఎలాంటి ఆసక్తి చూపించనట్టే లెక్క.