యతి ఉన్నాడని ఇప్పుడే కాదు.. గతంలోనూ పలు సంఘటనల్లో కొందరు చెప్పారు. విదేశీయులే కాదు, కొందరు భారతీయులు కూడా యతి ఉన్నాడని చెప్పి అందుకు కొన్ని సాక్ష్యాలను చూపే ప్రయత్నం చేశారు. కానీ యతి ఉన్నాడని చెప్పేందుకు అవేవీ శాస్త్రీయంగా నిరూపణ కాలేకపోయాయి.
ఈ అనంత విశ్వంలో మనిషి ఛేదించలేని, శోధించలేని, కనుగొనలేని రహస్యాలు, అంతుబట్టని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో యతి కూడా ఒకటి. విదేశీయులు యతిని బిగ్‌ఫూట్ అని పిలుస్తుంటారు. హిందువులు తమ పురాణాల ప్రకారం యతి అంటే ఆంజనేయ స్వామి అనే నమ్ముతారు. ఈ క్రమంలోనే తాజాగా భారత ఆర్మీ తాము యతి పాదముద్రలను చూశామని చెప్పి, దానికి సాక్ష్యంగా కొన్ని ఫొటోలను కూడా విడుదల చేయడంతో.. దేశ వ్యాప్తంగా ఈ విషయం మరోసారి సంచలనాన్ని రేకెత్తిస్తోంది. అయితే అసలు భారత ఆర్మీ నిజంగా చూసింది యతి పాదముద్రలనేనా ? అసలు నిజంగా యతి ఉన్నాడా ? ఉంటే అసలు మానవ జాతికి దూరంగా ఎక్కడో హిమాలయాల్లో ఎందుకు ఉన్నాడు ? వంటి ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలకు మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేద్దాం..!
యతి నిజంగా ఉన్నాడా..? చరిత్ర ఏం చెబుతోంది..?
యతి ఉన్నాడని ఇప్పుడే కాదు.. గతంలోనూ పలు సంఘటనల్లో కొందరు చెప్పారు. విదేశీయులే కాదు, కొందరు భారతీయులు కూడా యతి ఉన్నాడని చెప్పి అందుకు కొన్ని సాక్ష్యాలను చూపే ప్రయత్నం చేశారు. కానీ యతి ఉన్నాడని చెప్పేందుకు అవేవీ శాస్త్రీయంగా నిరూపణ కాలేకపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత ఆర్మీ యతి పాదముద్రలంటూ కొన్ని ఫొటోలను విడుదల చేయడంతో మరోసారి ఈ విషయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే నిజానికి యతి గురించిన ప్రస్తావన మన పురాణాలు, ఇతిహాసాల్లో మాత్రమే ఉంది. యతి అంటే.. హిందువులు చాలా మంది హనుమంతుడేనని విశ్వసిస్తారు. ఆయన చిరంజీవి కనుక ఇప్పటికీ హిమాలయాల్లోనే ఉన్నాడని కొందరు అంటుంటారు.
ఇక యతి అనే వ్యక్తి నిజానికి నేపాల్‌కు చెందిన ఒక పురాతన ఆటవిక తెగకు చెందిన వ్యక్తి అని అక్కడి వారు చెబుతారు. వారినే మంచు మనుషులు అంటారట. వీరు మనిషి కన్నా ఎత్తు ఎక్కువగా.. చూసేందుకు కోతి ఆకారంలో ఉంటారట. వీరు సైబీరియా, తూర్పు ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఉంటారని పలువురు చెబుతుంటారు. యతిని టిబెటియన్లు పెద్ద ఎలుగు అని పిలుస్తారు. అలాగే ఎలుగు మనిషి అని కూడా అంటారు. నేపాల్‌లోని షెర్పాస్ అనే తెగకు చెందిన వారు యతిని క్యాటిల్ బేర్ అని పిలుస్తారు. అలాగే హిమాలయన్ బ్రౌన్ బేర్, జంగిల్ మ్యాన్, స్నో మ్యాన్, మ్యాన్ బేర్ స్నోమ్యాన్ అనే పేర్లతో కూడా యతిని పిలుస్తుంటారు. ఇక పలువురు పర్వతారోహకులు యతిని అతి పురాతన మనిషి అని పిలుస్తుంటారు.
యతి అనే పదం మనకు 1వ శతాబ్దంలోనే పరిచయమైందని చరిత్ర చెబుతోంది. నేపాల్‌కు చెందిన షెర్పాస్ తెగ వారు తొలిసారిగా యతిని గుర్తించారట. యతి నాలుగు కాళ్లు లేదా రెండు కాళ్లపై అలవోకగా నడుస్తుందట. దాని వేగాన్ని అందుకోవడం మనుషులకు సాధ్యం కాదట. అంత వేగంగా అది నడుస్తుందట. అలాగే యతికి వృద్ధాప్యం కూడా వస్తుందని, అది అనారోగ్యం బారిన కూడా పడుతుందని.. అలాంటి సమయంలో దాన్ని పట్టుకునేందుకు వీలవుతుందని.. రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తాను రాసిన నేచురల్ హిస్టరీ ఇన్ ది ఫస్ట్ సెంచరీ ఏడీ అనే పుస్తకంలో చెప్పారు. అలాగే యతి చాలా భయంకరంగా అరుస్తుందని, ఒళ్లంతా వెంట్రుకలు, నీలం రంగు కళ్లు, కుక్కలను పోలి ఉండే దంతాలు కూడా దానికి ఉంటాయని ప్లినీ తెలిపారు. అలాగే కొన్ని రకాల యతులకు ఒంటిపై ఉండే వెంట్రుకలు బూడిద లేదా ఎరుపు రంగులో ఉంటాయట.
ఇక యతి ఉన్నాడా, లేడా అనే విషయానికి వస్తే.. భారత ఆర్మీనే కాదు, గతంలోనూ కొందరు ఇలాంటి ఫొటోలనే సాక్ష్యాలుగా చూపించారు. కొందరు యతి వెంట్రుకలు, చర్మం, గోళ్లు అంటూ కొన్ని సాక్ష్యాలను తెచ్చారు. కానీ అవి యతికి చెందినవేనని ఎవరూ నిరూపించలేకపోయారు. అవన్నీ పలు జాతులకు చెందిన జంతువులవని తేల్చారు. ఇక భారత ఆర్మీ ఇప్పుడు తీసిన ఫొటోలను బట్టి చూస్తే.. వాటిని కూడా శాస్త్రీయంగా నిరూపించే వరకు యతి ఉన్నాడని నమ్మలేం. కానీ చాలా మంది మాత్రం యతి నిజంగానే ఉన్నాడని విశ్వసిస్తున్నారు.
అయితే కొందరు మాత్రం యతి లేడని, అంతరించిపోతున్న ఏవో అరుదైన జాతులకు చెందిన జీవాలను అందరూ చూసి యతి అని భ్రమిస్తున్నారని ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సాధారణంగా పలు జాతులకు చెందిన జీవులు లేదా జంతువులు ఇతర జాతులకు చెందిన జీవులకు కంటబడకుండా ఉండేందుకు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. అలాగే యతి (ఒక జీవి) కూడా అలాగే జీవిస్తుంటాడని, అంత మాత్రాన వారు మనకు హాని చేస్తారని కూడా నమ్మలేమని పలువురు చెబుతున్నారు. అయితే యతి విషయంలో సైంటిస్టులు శాస్త్రీయంగా నిరూపించే వరకు మనం ఈ విషయాన్ని నమ్మలేమని నిర్దారణకు రావల్సిందే.. మరి సైంటిస్టులు ఈ దిశగా విజయవంతం అవుతారా..? లేదా..? వేచి చూస్తే తెలుస్తుంది..!