ఆ గోదారి చేప కేజీ రేటు రూ.6 వేలు… దాని టేస్టేంటో తెలుసా..?

-

పుల‌స‌.. క్వీన్ ఆఫ్ ది ఫిష్‌.. ఇదీ ఈ చేప రేంజ్‌! ఇక దాని రుచి అమోఘం.. దాని రేట్ వింటే కూడా అబ్బా..అనాల్సిందే మ‌రి. ఏడాది పొడ‌వునా దొరికితేనేమో.. పుల‌స విలువ తెలిసేది కాదు.. కేవ‌లం నెల‌రోజుల పాటు మాత్రమే ఇవి ల‌భిస్తాయి. అది కూడా గోదావ‌రి బంగాళాఖాతంలో క‌లిసే పాయ‌ల్లో మాత్ర‌మే మ‌త్స్య‌కారుల వ‌ల‌ల‌కు చిక్కుతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ స‌ముద్ర జ‌లాల్లో జీవించే పుల‌స‌లు పున‌రుత్ప‌త్తి కోసం సుమారు 11వేల నాటిక‌ల్ మైళ్ల దూరం ప్ర‌యాణించి గోదావ‌రిలోకి ఎదురీదుతాయి.


జూలై, ఆగ‌స్టు మాసాల్లో ఉప్పొంగే గోదావ‌రిలోకి ఎదురీది..ఇక్క‌డి ఇసుక, గుల‌క‌రాళ్ల ప్రాంతాల్లో గుడ్లు పెట్టి పిల్ల‌ల‌తో తిరిగి వెళ్తాయి. ఈ క్ర‌మంలోనే మ‌త్స్య‌కారుల వ‌ల‌ల‌కు చిక్కి సిరులు కురిపిస్తాయి. కేవ‌లం కొద్దిరోజులే దొరికే ఈ అరుదైన పుల‌స రేటు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంతేగాకుండా.. పుల‌స తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒమేగా–3, ఒమేగా–6 ఫ్యా టీ ఆమ్లాలు అధికంగా ఉన్నందువలన పులస ఆరో గ్యానికి ఎంతో మంచిదని చెబుతారు.

గర్భిణులకు పులస ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతా రు. ఈ చేప తినడం గుండెకు మంచిదని అంటారు. అయితే.. ఇక్క‌డ   మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ పుల‌స‌లు కూడా పాయ‌ల ఆధారంగా రుచి, ప‌రిమాణం ఉంటాయ‌ట‌. బంగాళాఖాతం ముఖద్వారం నుంచి బయలుదేరే పులస.. గోదావరిలో ఎంత దూరం ఎదురీదితే రుచి అంతగా ఉంటుందట‌. అందుకే సాగర సంగమ ప్రదేశాలైన యానాం, బోడసకుర్రు తదితర ప్రాంతాల్లో కంటే ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు అంటే అఖండ గోదావ‌రికి వెళ్లే చేప రుచి, పరిమాణం ఎక్కువగా ఉంటాయి.

అందుకే ధవళేశ్వరం, బొబ్బర్లంక, ఊబలంక తదితర ప్రాంతాల్లో లభించే చేపల ధర కూడా కిలో రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఉంటుంది. ఈ స‌మ‌యంలో పైస‌ల మొఖం ఎవ‌రు చూస్తారు.. అంద‌రూ పుల‌స‌ల వైపే ఉంటారు. అందుకే రేట్ ఎంతైనా స‌రే.. పుల‌స దొరికితే చాలున‌నుకుని కొనేస్తారు. అందుకే మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు.. క్ష‌ణాల్లో అమ్ముడైపోతుంది. పులసను పులుసుగానే ఎక్కువగా వండుతారు. మెన‌క‌టి త‌రం మ‌హిళ‌లు మాత్ర‌మే పుల‌స పులుసు బాగా చేయ‌గలుగుతార‌ట‌.

మసాలా దట్టించి మట్టికుండలో చింతపండు పులుసుతో దీనిని వండుతారు. చింతనిప్పులు లేదా కట్టెల పొయ్యి లేదా పిడకల మంటపైనే దీనిని వారు వండుతారు. పొయ్యిపై కూర ఉడికేటప్పుడు బెండకాయలు, వంకాయలు, మిరపకాయలు కోయకుండా ఉన్నవి ఉన్నట్టుగా వేస్తారు. ఇక ఆ త‌ర్వాత చూడాలే దాని రుచి.. ఆహా.. అనాల్సిందే మ‌రి. అలాగే ఈ పుల‌స పులుసు తయారీకి కొన్ని ప్ర‌త్యేక‌మైన ప‌ద్ద‌తులు ఉన్నాయి. ఆవకాయలో తేరిన ఎర్రటి నూనె, కొత్తివీుర వేస్తారు. కుండలో వండితేనే దీనికి అసలైన రుచి వస్తుందట‌. పులుసు వండడం పూర్తయ్యాక అదే కుండలో ఉంచి 24 గంటల తరువాత తింటే దాని రుచి అదిరిపోతుంద‌ని చెబుతుంటారు.

పులస చేపకు ముళ్లు ఎక్కువగా ఉండటంతో చాలా నేర్పుగా తినాల్సి ఉంటుంది. ఇందులో వేసిన బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి కూడా భలే రుచిగా ఉంటాయి. పులస ప్రపంచంలో మూడే మూడు ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నది, పశ్చిమ బెంగాల్‌లోని    హుగ్లీ నది, మన రాష్ట్రంలోని గోదావరి నది. గోదావరిలో కూడా కేవలం మూడే మూడు ప్రాంతాల్లో లభించే పులస రుచి పసందుగా ఉంటుంది. ఆ ప్రాంతాలు తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతం, నర్సాపురం. ఈసారి మాత్రం ఎలాగైనా పుల‌స పులుసు తినండి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news