చాకొలెట్ అంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. చిన్నాపెద్దా తేడా లేకుండా కనబడితే చాలు ఎగబడతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పిచ్చి మామూలుగా ఉండదు. తినాలంటే ధర కూడా అందుబాటులో ఉండాలి కదా. నిన్ననే ఓ చాకొలేట్ పుట్టుకొచ్చింది. దాని ధర వింటే మాత్రం నోట్లోంచి బదులుగా కళ్లలో నుండి నీళ్లు కారుతాయి.
ఐటిసీ – ఇండియాలో రకరకాల ఉత్పత్తులతో విలసిల్లే ఈ కంపెనీకి ‘ఫాబెల్’ పేరుతో చాకొలెట్ విభాగం కూడా ఉంది. అది కూడా చాలా ఖరీదైన చాకొలెట్లను తయారుచేస్తుంది. మొన్నీమధ్యే వీరొక కొత్తరకం చాక్లెట్ మార్కెట్లో్కి వదిలారు. ‘ట్రినిటీ ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినరీ’ పేరుతో విడుదలైన ఈ చాకొలెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా పేరుగాంచి, గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది.
కిలో చాక్లెట్లకు రూ. 4 లక్షల ముప్పైవేలుగా దీని ధర నిర్ణయించారు. ఒక్కో చెక్క డబ్బాలో పదిహేను చాకొలెట్ల చొప్పున ప్యాక్ చేసి రిలీజ్ చేసారు. ప్రతి బాక్స్‌లో పదిహేను చాక్లెట్లుంటాయి. ఒక్కోటి 15 గ్రాముల బరువుంటాయి. ఒక బాక్స్ ధర లక్ష రూపాయలు. ఈ చాక్లెట్ తయారీలో, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ చెఫ్ ఫిలిప్ కాంటిసిన్, ఫాబెల్‌చాక్లెట్ ఎక్స్‌పర్ట్‌లు పాల్గొన్నారు.