తెలంగాణలోని సూర్యపేట జిల్లాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో 85 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం రెండు లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఓడిన శానంపూడి సైదిరెడ్డి పోటీచేయగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి ఎన్నికల రంగంలో ఉన్నారు. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం టిఆర్ఎస్-కాంగ్రెస్ అభ్యర్థి మధ్య నువ్వానేనా అన్నట్టుగా జరిగింది. వీరిలో ఎవరు గెలుస్తారనేది గురువారం తేలిపోనుంది.
ముందుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు విశ్లేషిస్తే అధికార టీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయి. టిఆర్ఎస్ కు 50శాతం ఓట్లు వస్తాయని…. కాంగ్రెస్ 40 శాతం ఓట్లతో పెట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీల సంగతి అలా ఉంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి బిజెపి, టిడిపి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బీజేపీ నుంచి పలువురి పేర్లు పరిశీలించి చివరకు బీసీ కోటాలో కోట రామారావుకు టిక్కెట్ ఖరారు చేసింది.
ఇక టీడీపీ నుంచి హుజూర్‌నగర్ మాజీ జడ్పిటిసి చావా కిరణ్మయి రంగంలో ఉన్నారు. రెండు పార్టీలకు అసలు ఇక్కడ బలం లేదని తెలిసి కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. పోలింగ్ సరళితో పాటు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఈ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి అని స్పష్టం చేశాయి. ఫలితం కూడా ఇంచుమించు అలాగే వచ్చే అవకాశం ఉంది. అనవసరంగా టిడిపి-బిజెపి ఇక్కడ పోటీ చేసి పరువు పోగొట్టుకునేలా ఉన్నాయి. బిజెపి, టిడిపిలకు ఐదు శాతం ఓట్లు కూడా రాలేదని తెలుస్తోంది.
విచిత్రమేంటంటే తెలంగాణలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న బిజెపి కేవలం 2% ఓట్లతో ఉంటుందని తేలింది. బీజేపీ కంటే కాస్త బెటర్ గా టీడీపీకి 4 నుంచి 5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ డిపాజిట్ దక్కాలంటే 33,000 ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బిజెపి-టిడిపి 5000 ఓట్లు కూడా దాటడం కష్టంగా ఉంది. ఏదేమైనా బిజెపి-టిడిపి హుజూర్‌నగర్ లో పోటీ చేసి ఘోరంగా పరువు పోగొట్టుకోవడం దాదాపు ఖాయమైపోయింది.