పబ్‌జి మొబైల్.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ పట్టుకున్న ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. అంతలా ఈ గేమ్ పాపులర్ అయింది. పిల్లలు, యువత ఈ గేమ్‌కు బానిసలయ్యారు. పరీక్షలు ఉన్నా లెక్క చేయకుండా విద్యార్థులు పబ్‌జి గేమ్‌లో పడి మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే పబ్‌జి మొబైల్ గేమ్‌కు సంబంధించిన నెగిటివ్ ప్రభావాల వల్ల ఏర్పడుతున్న దుష్పరిణామాలను, దాని వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఓ వ్యక్తి పబ్‌జి మొబైల్ గేమ్‌కు బానిసై గర్భంతో ఉన్న తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు.
పబ్‌జి వ్యసనం ఓ వ్యక్తిని తన భార్యకు విడాకులు ఇచ్చేలా చేసింది. ఓ వ్యక్తి ఇటీవలే పబ్‌జి మొబైల్ గేమ్‌కు బానిసయ్యాడు. అతను చేస్తున్న ఉద్యోగానికి కూడా వెళ్లకుండా రాత్రింబవళ్లు ఇంట్లోనే ఉంటూ పబ్‌జి మొబైల్ గేమ్ ఆడేవాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి, అతని భార్యకు తీవ్రంగా గొడవలయ్యేవి. అయితే ఒక రోజు ఇదే విషయమై ఆ భార్యాభర్తలు గొడవపడగా, అప్పుడు భర్త భార్యకు విడాకులు ఇస్తానని తేల్చేశాడు. తనకు భార్య కన్నా పబ్‌జి మొబైల్ గేమే ఎక్కువని అతను భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. కాగా ఆ భార్యాభర్తల పేర్లు తెలియకపోయినా, ఇప్పుడీ వార్త మాత్రం నెట్‌లో వైరల్ అవుతోంది.
పబ్‌జి మొబైల్ అడిక్షన్ కేవలం మన దేశంలోనే కాదు. ఇతర దేశాల్లోనూ క్రమంగా పెరుగుతోంది. ఒక్క బ్రిటన్‌లోనే పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల ఏకంగా 200 మంది విడాకులు తీసుకున్నారట. ఇక మన దేశంలో ముంబైలో ఓ యువకుడు పబ్‌జి మొబైల్ గేమ్ ఆడేందుకు ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రలను అడగ్గా, వారు అందుకు ఒప్పుకోకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కాశ్మీర్‌లో పబ్‌జి మొబైల్ గేమ్‌కు బానిసైన ఓ ఫిట్‌నెస్ ట్రెయినర్ గేమ్‌లో ఓటమితో మానసికంగా కుంగిపోయి పిచ్చోడిలా మారాడు. తరువాత హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ అతను చనిపోయాడు. ఇవి మన తెలిసిన చాలా తక్కువ ఉదాహరణలు మాత్రమే. నిజానికి మన దేశంలో పబ్‌జి మొబైల్ బారిన పడి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నవారు చాలా మందే ఉండి ఉంటారని మానసిక వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ గేమ్‌ను భారత్‌లో బ్యాన్ చేయాలని చాలా మంది కోరుతున్నారు.