సాధారణంగా పక్షులు, ఇతర జీవులు చలికాలంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. సీజన్ ముగియగానే సొంత ప్రాంతాలకు తిరిగి వస్తాయి. ఇక తాబేళ్లు కూడా ఈ సీజన్‌లో కొన్ని ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. ముఖ్యంగా అవి సంతానోత్పత్తి కోసమే అలా వలస వెళ్తాయి. ఇక ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఉన్న గహిర్‌మత బీచ్‌కు కూడా లక్షల సంఖ్యలో తాబేళ్లు వలస వచ్చాయి. దీంతో అక్కడ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సదరు బీచ్ కు వచ్చిన తాబేళ్లు ఆలివ్ రైడ్లీ జాతికి చెందినవి. ఇవి సముద్రపు తాబేళ్ల జాబితా కిందకు వస్తాయి. ఏటా లక్షల సంఖ్యలో ఇవి ఆ బీచ్‌కు వలస వస్తాయి. ఆడ, మగ తాబేళ్లు కలయిక అనంతరం మగ తాబేళ్లు వెళ్లిపోతాయి. తరువాత ఆడ తాబేళ్లు గూళ్లను ఏర్పాటు చేసి గుడ్లను పెట్టి అవి కూడా వెళ్లిపోతాయి. అనంతరం కొన్ని రోజులకు పిల్లలు బయటకు వస్తాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ బీచ్‌లో కొన్ని లక్షల సంఖ్యలో తాబేళ్లు కనువిందు చేస్తున్నాయి.
ఇక బీచ్‌కు తాబేళ్లు వచ్చిన నేపథ్యంలో చేపలు పట్టడాన్ని అధికారులు నిషేధించారు. చేపలు పట్టడం వల్ల ఆ సమయంలో అనేక తాబేళ్లు చనిపోతున్నాయని చెప్పి వారు ప్రస్తుతం ఆ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆ తాబేళ్లు ఒక్కొక్కటి సుమారుగా 120 నుంచి 150 గుడ్లను పెడతాయి. అయితే అన్ని గుడ్ల నుంచి పిల్లలు రావు. కొన్ని గుడ్లు నాశనమవుతాయి. కొన్ని సముద్రపు అలల తాకిడికి కొట్టుకుపోతాయి. మిగిలిన వాటిల్లోంచి పిల్లలు బయటకు వస్తాయి. అందుకు సుమారుగా 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది.
కాగా 2019-20 సమయంలో సుమారుగా 7.30 లక్షల తాబేళ్లు ఆ బీచ్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసారి కూడా దాదాపుగా ఇంతే సంఖ్యలో వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.