అత్తగారు కాస్త ఇవి తెలుసుకోండి.. కోడలి మీద కోపమేలా..!

-

కొత్తగా పెళ్లైయి..అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలకు చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి. అందరూ కొత్తవారే..త్వరగా కలిసిపోవడం అంటే చాలా కష్టం. ఆ పరిస్థితుల్లో..అత్తయ్యాను..అదేదో రాజ్యాధికారం చేజికించుకున్నా అని..ప్రవర్తిస్తుంటారు కొందరు అత్తలు. అయితే కోడల మదిలో ఉన్న భయాలను తొలగించటంలో అత్తపాత్ర చాలా ముఖ్యం. పెళ్లైన కొత్తలోనే..అత్తకోడల మధ్య బంధం బలపడితే..అసలు వాళ్ల మధ్యలో గొడవలే రావు. ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవలంటున్నారు నిపుణులు.

గుర్తుపెట్టుకోండి..!

మీ కుటుంబంతో కోడలు అనురాగాన్ని పెంచుకోవాలంటే అత్తగారిగా మీరు చేయాల్సింది మరొకటుంది! అదేంటంటే.. తనకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్ని గుర్తుపెట్టుకోవడం! పుట్టినరోజు, పెళ్లిరోజు.. వంటివి ఏడాదికోసారి వస్తాయి. ఆయా తేదీల్ని గుర్తుపెట్టుకొని.. అందరికంటే ముందుగా మీరే ఆమెకు విషెస్‌ చెప్పడం, చిన్న పార్టీ ఏర్పాటుచేసి ఆమె తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని ఆహ్వానించడం.. ఇలా ఆమె విషయంలో మీరు చూపే ప్రత్యేక చొరవే మీ మనసులో తనకున్న స్థానమేంటో తెలియజేస్తుంది.

ఏదైనా సమానంగానే..!

చాలామంది అత్తలు తమ కూతుళ్లని ఒకలా, కోడళ్లను మరోలా చూస్తుంటారు. కొంతమంది కోడళ్లు కూడా ఈ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలో కన్న కూతురిపై ఉన్న ప్రేమతో, కొడుకుపై ఉన్న అనురాగంతో.. సందర్భానుసారం, ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో/ఫంక్షన్లప్పుడు.. వాళ్లకు కానుకలివ్వడం, కోడలి విషయంలో మొండిచేయి చూపించడం చాలామంది చేస్తుంటారు.
ఇలాంటి అసమానతలే క్రమంగా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. అందుకే అకేషన్‌ ఏదైనా/ఎవరిదైనా కూతురికి కానుకలు పెట్టాలనుకున్నప్పుడు.. అదే బహుమతిని అదనంగా కోడలి కోసం కూడా కొనడం మర్చిపోవద్దంటున్నారు నిపుణులు.. ఇలా ఇద్దరికీ ఒకేసారి బహుమతులు అందివ్వడం వల్ల.. ‘నువ్వూ నా కన్న కూతురితో సమానం!’ అన్న మాట అత్తగారు కోడలికి చెప్పకనే చెప్పినట్లవుతుంది. ఒకవేళ ఒకేసారి ఇద్దరికీ బహుమతులు కొనలేని పక్షంలో కోడలు పుట్టినరోజు, పెళ్లిరోజు, సీమంతం.. వంటి ప్రత్యేక సందర్భాల్లో మీరివ్వాలనుకున్న కానుకను ఇవ్వండి…ఈ చిన్న ప్రయత్నమే అత్తాకోడళ్ల మధ్య సఖ్యతను పెంచుతుంది.

ఇంటి గుట్టు బయటకు పోనివ్వకండి

అత్తాకోడళ్లిద్దరూ ప్రేమగా మెలిగినప్పటికీ..మీ మధ్యలో మూడో వ్యక్తి తలదూర్చినప్పుడే గొడవలు జరుగుతుంటాయి. కొంతమంది కావాలనే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు.. మీరు ఎప్పటిలాగే ఖాళీ సమయంలో ఇరుగుపొరుగు వాళ్లతో మాట్లాడినప్పుడు.. వాళ్లు మీ కోడలి గురించి తెలుసుకోవాలని ఆరాటపడడం, ఆమెలోని లోపాల్ని ఎత్తిచూపడం, లేనిపోనివి కల్పించి చెప్పడం.. ఇలా ఏదో ఒకటి చేసి మీ మధ్య గొడవ రాజేయాలని చూస్తుంటారు. ఇలాంటి సమయంలో మీ మనసు అదుపు తప్పకుండా ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.
వాళ్ల మాటల్లో నిజానిజాలు తెలుసుకోకుండా మీరు మీ కోడలిని అనుమానించడం, అనవసరంగా వాళ్లతో ఓ మాట అనడం, పొరుగు వాళ్లతో మాట్లాడేటప్పుడు మీ కోడలి గురించి గుసగుసలాడడం.. ఇలా చేస్తే మీ ఇంటి గుట్టు మీరే బయటపెట్టినట్లు అవుతుంది. కాబట్టి నిజంగా అత్తాకోడళ్ల మధ్య భేదాభిప్రాయాలుంటే గడప దాటకుండా, మూడో వ్యక్తికి మాట్లాడే అవకాశమివ్వకుండా మీరిద్దరే పరిష్కరించుకోవడం ఉత్తమం.

తప్పెవరిదో ముందు తెలుసుకోండి!

భార్యభర్తల మధ్య గొడవలు కొన్ని సార్లు..పెద్దవాళ్ల వరకూ వెళ్తాయి..అప్పుడు అత్తలు కొడుకుకే సపోర్ట్ చేస్తారు. తద్వారా మీ కోడలికి మీపై నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడచ్చు. కాబట్టి ఎవరికీ మద్దతు తెలపకుండా అత్తగా మీరు ముందు తప్పెవరిదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగని తప్పు చేసిన వారిని నిందించకుండా.. వారు తమ పొరపాటును గ్రహించి సరిదిద్దుకునే అవకాశమివ్వండి. ఈ క్రమంలో మీరివ్వాలనుకునే సలహాలు వారితో పంచుకోవచ్చు. ఇలా ప్రతి విషయంలోనూ కోడలితో పారదర్శకంగా వ్యవహరిస్తే అసలు అత్తాకోడళ్ల మధ్య భేదాభిప్రాయాలే రావు.

అనుమానించద్దు

ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా కొంత సమయం కేటాయించుకోవాలని ఉంటుంది. కొత్తగా పెళ్లైనా ఎప్పుడూ భర్తతోనే గడపకుండా.. తన స్నేహితులతో అలా బయటికి వెళ్లాలని, షాపింగ్‌ చేయాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటారు.. ఇలాంటప్పుడు ‘నా కొడుకుతో కాకుండా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లడమేంటి?’ అని విసుక్కున్నారనుకోండి.. మీరు తనను అనుమానిస్తున్నారేమోనన్న ఆలోచన మీ కోడలిలో మొదలవుతుంది. ఇది ఇద్దరి మధ్య అనుబంధానికి ఏ మాత్రమూ మంచిది కాదు. కాబట్టి కొన్నిసార్లు మీ కోడలకి కాస్త ఫ్రీ స్పేస్‌ను వదిలేయడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే తన విషయంలో మీకేదైనా పొరపాటుగా అనిపిస్తే ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, సమస్యను పరిష్కరించుకోవడం వల్ల మీరిద్దరూ అత్తాకోడళ్లలా కాదు.. తల్లీకూతుళ్లలా కలిసిపోవచ్చు.
ఇలా అత్తగారే కాదు.. ప్రతి కోడలూ అత్తగారిని అమ్మలా భావించి అన్ని విషయాలూ పంచుకోవాలి.. ప్రేమగా చూసుకోవాలి. తద్వారా ఇద్దరి మధ్య మంచి అవగాహన, అనుబంధం ఏర్పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news