ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ బలమైన ముద్ర వేస్తోంది. ఇక క్రికెట్ విషయానికి వస్తే.. ఒకప్పటి కన్నా ఇప్పుడు టెక్నాలజీ వినియోగం మరింత పెరిగింది. అంపైర్ల డీఆర్ఎస్ మొదలుకొని ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచుల్లో టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. అయితే ఇకపై ఈ టెక్నాలజీ వల్ల క్రికెట్‌ను చూసే వీక్షకులకే కాదు, ఆడే వారికి కూడా మజా రానుంది. ఎలా అంటారా..? పవర్ బ్యాట్‌తో..! అవును, మీరు విన్నది కరెక్టే. పవర్ బ్యాటే.. భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే సారథ్యంలో పవర్ బ్యాట్ రూపకల్పన జరుగుతోంది. ఇంతకీ అసలీ పవర్ బ్యాట్ విశేషాలేంటి ? తెలుసుకుందాం పదండి..!
ఇప్పటి వరకు మనం క్రికెట్‌లో టెక్నాలజీ పరంగా అనేక ప్రయోగాలు చూశాం. వాటిల్లో సరికొత్త ప్రయోగమే పవర్ బ్యాట్. పవర్ బ్యాట్ అంటే ఏమీ లేదు.. క్రికెటర్లు వాడే బ్యాట్‌లోనే క్రెడిట్ కార్డు సైజ్ ఉండే ఓ సెన్సార్ స్టిక్కర్‌ను అమరుస్తారు. ఈ క్రమంలో క్రికెటర్ ఆ బ్యాట్‌తో ఆడేటప్పుడు ఆ సెన్సార్ పనిచేస్తుంది. క్రికెట్ ఏ షాట్‌ను ఎలా ఆడుతున్నాడు, బ్యాట్ స్పీడ్ ఎంత ఉంది, బ్యాట్‌ను ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు.. వంటి వివరాలను ఆ సెన్సార్ గ్రహిస్తుంది. అనంతరం వైర్‌లెస్‌గా ఆ వివరాలను కంప్యూటర్‌లోని క్లౌడ్ కంప్యూటింగ్ యాప్‌కు అందిస్తుంది. ఆ యాప్ సదరు డేటాను విశ్లేషించి అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఆ డేటా క్రికెటర్లకు, కోచ్‌లకు, కొత్తగా క్రికెట్ నేర్చుకునే వారికి ఎంతగానో పనికొస్తుంది. ఇక మ్యాచ్‌లు జరిగే సమయాల్లో ఆ డేటాను రియల్‌టైంలో బ్రాడ్‌కాస్టర్లు టీవీల్లో టెలికాస్ట్ చేస్తారు. దీంతో తమ అభిమాన క్రికెటర్ బ్యాట్‌ను ఎలా వాడుతున్నాడు అనే వివరాలను అటు వీక్షకులు కూడా తమ తమ టీవీ తెరలపై చూసి తెలుసుకోగలుగుతారు.
అనిల్ కుంబ్లే సారథ్యంలోని నిపుణుల బృందం పవర్ బ్యాట్‌ను రూపొందిస్తుండగా, అందుకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్, స్టార్ ఇండియా కంపెనీలు సహకారాన్ని అందిస్తున్నాయి. అనిల్ కుంబ్లేకు చెందిన స్పెక్టాకామ్ అనే స్టార్టప్ కంపెనీ ఆ పవర్ బ్యాట్‌ను రూపొందిస్తోంది. ఇక మైక్రోసాఫ్ట్ తన అజుర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ సహాయంతో ఆ బ్యాట్ కు సహకారం అందిస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే ఆ పవర్ బ్యాట్‌ను క్రికెటర్లకు అందుబాటులోకి తేనున్నారు. మరి పవర్ బ్యాట్ ఎప్పుడు క్రికెటర్లకు అందుబాటులోకి వస్తుందో.. కొంత కాలం వేచి చూస్తే తెలుస్తుంది..!