దేశ అధ్యక్షుడి పేరును ఓ పందికి పెట్టారు.. పెట్టింది ఇప్పుడు కాదులో.. ఎప్పుడో.. కానీ దానివల్ల ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. పోయి పోయి పందికి అధ్యక్షుడి పేరు పెట్టడమేంటి..? అసలే ఆ అధ్యక్షుడిపై దేశమంతా గుర్రుమంటుంది… ఈ తరుణంలో.. పందికి కూడా ఆ పేరు ఉండటంతో.. ప్రజలు మాములుగా ఆడుకోవడం లేదు..జర్మనీలోని బవేరియాలో ఓ జంతువుల పార్క్ ఉంది. అక్కడి ఓ అడవి పంది (Wild Boar)కి పుతిన్ అనే పేరు ఎప్పటి నుంచో ఉంది. ఆ పంది రష్యాకి సంబంధించిన ప్రత్యేక పంది జాతికి వారసురాలట.. అందువల్ల గుర్తు కోసం వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అని పేరు పెట్టారు. ఇక్కడే మొదలైంది చిక్కు..
ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.. రష్యా అధ్యక్షుడైన పుతిన్ పేరును ఆ పందికి అలాగే ఉంచితే… అది లేనిపోని సమస్యలకు దారి తీస్తుందని ముందే గ్రహించిన పార్క్ అధికారులు దాని పేరును తొలగించారు. ఇప్పుడు దాన్ని పుతిన్ అని పిలవడానికి వీలు లేదు.
ఈ పేరు మార్చాలని కొన్ని రోజులగా చర్చ నడుస్తుంది.. పార్కుకు వస్తున్న వారు.. ఆ పంది గురించి తెలుసుకొని… పనిగట్టుకొని మరీ.. దాన్ని “పుతిన్ పుతిన్” అని పిలుస్తూ… రష్యా అధ్యక్షుడిపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకుంటున్నారు. దానికి తోడు సందర్శకులకు ఆ పంది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అందువల్ల పుతిన్ అనే పేరు పార్కులో వినిపిస్తే చాలు… అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
పార్కుకు వచ్చే వారిలో కొంతమంది ఉక్రెయిన్ వాసులున్నారు. వారంతా జర్మనీకి శరణార్థులుగా వచ్చారు. వారు ఈ పార్కుకు వచ్చినప్పుడు పుతిన్‌పై ఉన్న ఆగ్రహాన్ని పందిపై చూపిస్తున్నారు. దీంతో పార్క్ నిర్వాహకులు గత మంగళవారం పేరు మార్చేశారు.
ఇక అడవి పందికి కొత్తగా ఏం పేరు పెట్టాలి అని ఆలోచించిన అధికారులు అందుకోసం సోషల్ మీడియాలో ఓ కంటెస్ట్ ప్రారంభించారు. దానికి సరైన పేరు పెట్టమని నెటిజన్లను కోరారు. 2,700 మంది కొత్త పేర్లను సూచించారు. వాటిలోంచి.. ఓ పుస్తకం సిరీస్‌లోని ఊహాత్మక పోలీస్ పర్సన్ అయిన ఎబెర్హోఫెర్ (Eberhofer) పేరు పెట్టాలని ఫైనల్ గా అధికారులు నిర్ణయించారు. ఇలా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కాస్తా ఆ పందికి పేరు మార్చే వరకూ పోయింది.