విజయవాడలో రవిప్రకాశ్.. పోలీసులకు మెయిల్.. శివాజీ కూడా అక్కడే..!

ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. రవి ప్రకాశ్ ప్రస్తుతం విజయవాడలో ఉన్నారట. సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన మెయిల్స్ కూడా పంపించారట. మెయిల్స్‌లో తాను విచారణకు హాజరవుతాను కానీ.. తనకు ఓ పది రోజుల సమయం కావాలని గడువు కోరారట. వ్యక్తి గత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.

raviprakash and shivaji sent mails to cyber crime police

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాజీ కూడా తన ఆరోగ్య కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. పోలీసులు వీళ్లు మెయిల్స్ పంపిన ఐపీ అడ్రస్ ఆధారంగా.. వాళ్లు విజయవాడలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు పోలీసులు రవిప్రకాశ్, శివాజీ ఇద్దరికీ నోటీసులు పంపించినా.. వాళ్ల నుంచి ఎటువంటి స్పందన లేకపోగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీళ్లు ఏపీలోనే ఉన్నారు.. అనే విషయం కన్ఫమ్ అయితే అక్కడికి వెళ్లి వాళ్లను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.