ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఏకంగా రూ.1 లక్ష కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిందట. అయితే ఆ రుణాలు ఎవరు తీసుకున్నవి ? అనే విషయాలను మాత్రం ఎస్‌బీఐ వెల్లడించలేదు.
అప్పుల పాలైన అన్నదాతను ఆదుకోమంటే.. బ్యాంకులకు మనస్సు రాదు.. కానీ కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు ఓ వైపు బ్యాంకుల నుంచి అప్పులను తీసుకుని.. వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నా.. బ్యాంకులు మాత్రం పట్టించుకోవు సరికదా.. సదరు అప్పులను మాఫీ చేస్తుంటాయి. అవును, మీరు షాక్ అయినా ఇది నిజమే. గత కొన్ని సంవత్సరాల కాలంలో బడా వ్యాపారులు, సంస్థలు తీసుకున్న కొన్ని లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మాఫీ చేశాయట. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది.
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఏకంగా రూ.1 లక్ష కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిందట. అయితే ఆ రుణాలు ఎవరు తీసుకున్నవి ? అనే విషయాలను మాత్రం ఎస్‌బీఐ వెల్లడించలేదు. ఈ క్రమంలోనే ఆ రుణాలను బడా వ్యక్తులే తీసుకుని ఉంటారని అంతా భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకు ఎస్‌బీఐ రూ.61,663 కోట్ల రుణాలను మాఫీ చేసిందని తెలిసింది. అలాగే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ.40,809 కోట్ల రుణాలను మాఫీ చేసిందట. అంటే.. మొత్తం కలిపి రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ రూ.1.02 లక్షల కోట్ల రుణాలను ఎస్‌బీఐ మాఫీ చేసినట్లు స్పష్టమవుతుంది.
ఇక దేశంలోని ప్రభుత్వ రంగానికి చెందిన 21 బ్యాంకులు గత నాలుగున్నర ఏళ్ల బీజేపీ పాలనలో ఏకంగా రూ.3.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయట. దీంతో ఈ అన్ని రుణాలను కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులే తీసుకుని ఉంటారని, అనంతరం వాటిని చెల్లించడంలో వారు విఫలం అయి ఉంటారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సదరు రుణాలను టెక్నికల్‌గానే మాఫీ చేశామని, కానీ రుణాలను తీసుకున్నవారు కచ్చితంగా వాటిని చెల్లించాలని గతంలో ఓ సారి మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మరి ఇప్పటి వరకు అలాంటి రుణాలను ఎన్నింటిని వసూలు చేశారో.. బ్యాంకులు, పాలకులే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా.. దేశంలోని బ్యాంకులు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ఊడిగం చేస్తున్నట్లు మాత్రం మనకు స్పష్టమవుతోంది..!