అంతు చిక్కని రహస్యం.. మంటల్లో దూకే పక్షులు..!

ఈశాన్య రాష్ట్రాలు అనగానే ఏదో కొత్త లోకానికి వెళ్లినట్లు అనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కనిపించే అందాలు.. ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తాయి. అస్సాం అంటే ఎక్కువగా అందరికీ గుర్తుకు వచ్చే అస్సాం టీ. తేయాకు పంట పొలాలు కనులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. అయితే మనకు ఇక్కడ ఊటీ ఎలాగో.. ఈశాన్య రాష్ట్రాల్లో నీలిరంగు కొండలు కూడా అలాగే. అక్కడ హఫ్లాంగ్ అనే చిన్న కొండ కూడా ఉంది. అస్సాంలోనే ఏకైక హిల్ స్టేషన్.

జతింగ పక్షి
జతింగ పక్షి

సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో హఫ్లాంగ్ పట్టణం ఉంది. గువాహటి నగరానికి 355 కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న పట్టణం ఉంది. హఫ్లాంగ్ పర్యాటకంలో ప్రధానమైన విశేషం హఫ్లాంగ్ సరస్సు. ఇది ఒక మంచి నీటి సరస్సు. ఈ సరస్సులో బోటు షికారు మధురానుభూతిని కలిగిస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మిజో, నాగా, మిమార్, దిమాసా, కుకి, హ్రాంగ్‌కోల్ వంటి ఆదివాసీ జాతులు నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో పర్యటనలు ఎక్కువగా అస్సామీల క్యాలెండర్ ప్రకారం మార్చి నుంచి ఏప్రిల్ నెలలో జరుగుతుంటాయి. వీరు ఈ నెలల్లోనే బిహు ఫెస్టివల్ నిర్వహించుకుంటారు. ఇక్కడి వాతావరణాన్ని, సరస్సు, పక్షులను చూసేందుకు పర్యాటకు తరలి వస్తుంటారు.

హఫ్లాంగ్ పట్టణానికి 9 కి.మీ దూరంలో జతింగ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి ప్రపంచదేశాల నుంచి పక్షులు వలస వస్తుంటాయి. ఇప్పటివరకు పరిశోధకులు 44 రకాల పక్షి జాతులను కనుగొన్నారు. ఇందులో ఒక జాతి పక్షి ఎంతో ప్రత్యేకమైంది. ఇది చేసే పని చూస్తే అందరూ షాక్‌కి గురవుతారు. ఈ పక్షి ఎందుకు అలా చేస్తుందో అంతు చిక్కని రహస్యం. ఆ పక్షి పేరు హరికిరి. ఇవి పొగమంచుల్లో చక్కర్లు కొడుతూ కాలుతున్న మంటలోకి దూకి ప్రాణాలను అర్పిస్తాయి. ఈ పక్షులు ఎందుకు అలా చేస్తాయని అమెరికా, యూరప్, జపాన్ దేశాల నుంచి పరిశోధకులు వస్తున్నా.. జతింగ పక్షి ప్రాణాలు అర్పించుకోవడంపై ఇప్పటికి ఎవరికీ సమాధానం దొరకలేదు.