ఆగిన గుండెకు ఆపరేషన్ చేసి బతికించడం చూసి ఉంటారు, ఇంకా ఏవేవో పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తారు. కానీ తెగిన తలను అతికించడం గురించి మీరు విన్నారా..? మెడికల్ మిరాకిల్ ఇది. దాదాపు మృత్యు ఒడికి చేరుకున్న ఓ పిల్లాడిని రక్షించారు వైద్యులు. ఇజ్రాయిల్ వైద్యులు తెగిన తలను తిరిగి అతికించి ఆ పిల్లాడికి పునర్జన్మను ఇచ్చారు. ఇంతవరకు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదట.
ఇజ్రాయిల్‌లోని జోర్డాన్ వ్యాలీలో నివాసం ఉంటున్నాడు 12 ఏళ్ల సులేమాన్ హసన్. స్కూలు నుంచి ఇంటికి సైకిల్ పై వస్తుండగా కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు అయినా పిల్లాడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం తీవ్రంగా జరగడంతో మెడ భాగంలో చాలా గాయాలయ్యాయి. పొత్తికడుపులోను బలమైన దెబ్బలు తాకాయి. తలా, శరీరం ఒకదాని నుంచి ఒకటి వేరయ్యాయి. బయట నుంచి తల, శరీరం అతుక్కున్నట్టు కనిపిస్తున్నా… లోపల వెన్నుముకతో తలకు ఉన్న అనుసంధానం దాదాపు తెగిపోయింది. కేవలం చివరి అంచు మాత్రమే కలిపి ఉంది. ఆ స్థితిలో ఎవరైనా చనిపోతారు. వైద్యులు అతని పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. వీలైనంతవరకు అతడిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆపరేషన్ చేశారు. శస్త్ర చికిత్స ద్వారా తల భాగంలోని లిగ్మెంట్లు, వెన్నెముకతో తిరిగి కలిపారు. ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఆసుపత్రిలో ఉన్న దాదాపు అన్ని విభాగాల్లోని వైద్యులు కూడా కొన్ని గంటల పాటు ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఉన్న సాంకేతికత, వైద్యుల అనుభవం ఆ పిల్లాడిని కాపాడేందుకు ఎంతో ఉపయోగపడింది. ఆపరేషన్ సక్సస్ అయింది.
దాదాపు చావు అంచుల దాకా వెళ్ళిన పిల్లాడిని తిరిగి పునర్జన్మను పోశారు వైద్యులు. దాదాపు నెలపాటు హసన్ ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఈ మధ్యనే డిశ్చార్జి అయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లినా కూడా వైద్యులు, నర్సుల పర్యవేక్షణలోనే ఉంటున్నాడు. వారికి ఒక్కగానొక్క బిడ్డ హసన్. ఆసుపత్రిలో చేర్చే సమయానికి అతని మెడ వేలాడిపోయి ఉంది.. దీంతో అతను బతకడని అందరూ అనుకున్నారు. కానీ వైద్యుల కఠోర శ్రమతో ఆ పిల్లాడికి తిరిగి ప్రాణం పోసి తల్లిదండ్రులకు అప్పజెప్పారు.