రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తుంటే.. ఎవరైనా సైడ్ ఇస్తారు.. ఎంత ట్రాఫిక్ ఉన్నాసరే అంబులెన్స్‌కు దారిస్తారు.. అలాంటిది.. అంబులెన్స్ డ్రైవరే పెషంట్ను పెట్టుకోని బండి పక్కకు ఆపి వెళ్లి మద్యం తెచ్చుకున్నాడు. అతను తెచ్చుకోని తాగింది కాక పెషంట్‌కు కూడా తాగించాడు. ఇదంతా అక్కడున్న వారు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.. రికార్డ్ చేశాక ఊరుకుంటారా.. తీసి సోషల్ మీడియాలో పెట్టారు.. అంతే వీడియో కాస్త వైరల్ అయింది. ఒడిశాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
కాలికి దెబ్బ తగిలిన ఓ వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్స్‌ను డ్రైవర్.. తిర్తోల్ హైవే పక్కన ఆపాడు. మద్యం సీసా ఓపెన్ చేసి గ్లాసులో పోసుకొని తాగాడు. అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్‌కు కూడా మద్యం పట్టించాడు ఆ డ్రైవర్. కాలికి దెబ్బ తగిలి కట్టుతో కదల్లేని స్థితిలో ఉన్న పేషెంట్ కూడా మద్యం తాగడం హైలెట్.. ఈ విషయాన్ని అక్కడే ఉన్న కొందరు వాహనదారులు చూశారు. ఇదేంటి ఇలా చేశావ్ అని అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రశ్నించారు. అయితే అడిగిన ప్రజలపై అంబులెన్స్ డ్రైవర్ తిరగబడ్డాడు. అంబులెన్స్ లో ఉన్న ఆ వ్యక్తే తనను మద్యం అడిగాడని, అందుకే రోడ్డుపై ఆపి పెగ్ ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ఈ తతంగమంతా జరుగుతున్నప్పుడు అంబులెన్స్‌లో ఆ పేషెంట్‌తో పాటు ఓ మహిళ, పిల్లాడు కూడా ఉన్నారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. దీన్ని చూసినవారు ఆ అంబులెన్స్ డ్రైవర్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం కోసం ఇలా చేస్తారా అని మండిపడుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ విషయంపై జగత్సింగ్పూర్ జిల్లా మెడికల్ ఆఫీసర్ స్పందించి ఏమన్నారంటే..
అది ప్రైవేట్ అంబులెన్స్ అయిన కారణంగా మేం చెప్పేందుకు ఏమీ లేదు. కానీ, సంబంధింత ఆర్టీవో, పోలీస్ స్టేషన్ అధికారులు.. తప్పు చేసిన ఆ డ్రైవర్ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగత్సింగ్పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO) క్షేత్రబసి దాస్ తెలిపారు. అక్కడి స్థానికులు కూడా అంబులెన్స్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.