ఈ టైర్ల‌కు గాలి కొట్టించాల్సిన ప‌నిలేదు.. పంక్చ‌ర్లు కూడా ప‌డ‌వు తెలుసా..?

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ర‌కాల టైర్ల‌ను చూశాం. ఒక‌టి ట్యూబ్ ఉన్న టైర్‌. మ‌రొక‌టి ట్యూబ్‌లెస్ టైర్‌. అయితే ఇక‌పై కొత్త ర‌కం టైర్లు రానున్నాయి.

హాయిగా సాగిపోతున్న వాహ‌న ప్ర‌యాణంలో ఏదైనా ఇబ్బంది వ‌స్తే చికాకు క‌లుగుతుంది. ముఖ్యంగా వాహ‌నానికి సంబంధించిన టైర్లు పంక్చ‌ర్ అయ్యాయ‌నుకోండి. అప్పుడింక మ‌న‌కు క‌లిగే అవ‌స్థ అంతా ఇంతా కాదు. టూవీల‌ర్ అయితే తోసుకు వెళ్లాలి. పెద్ద వాహ‌నం అయితే స్టెప్నీ టైర్ మార్చాలి. అది లేక‌పోతే టైర్ ఊడ‌దీసి పంక్చ‌ర్ వేయించుకోవాలి. అయితే సాధారణంగా ట్యూబ్ ఉన్న టైర్ల‌కే ఇలాంటి ఇబ్బందులు వ‌స్తుంటాయి. అదే ట్యూబ్‌లెస్ టైర్ అయితే మ‌నం వాహ‌నాన్ని ఆపాల్సిన ప‌నిలేదు. నేరుగా పంక్చ‌ర్ షాపుకు వెళ్లి పంక్చ‌ర్ వేయించుకోవ‌చ్చు. అయితే ప్ర‌స్తుతం మార్కెట్‌లో మ‌న‌కు ఈ రెండు ర‌కాల టైర్లు ల‌భిస్తున్నాయి కానీ.. త్వ‌ర‌లో కొత్త త‌ర‌హా టైర్లు అందుబాటులోకి రానున్నాయి. మ‌రి ఆ టైర్ల స్పెషాలిటీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ర‌కాల టైర్ల‌ను చూశాం. ఒక‌టి ట్యూబ్ ఉన్న టైర్‌. మ‌రొక‌టి ట్యూబ్‌లెస్ టైర్‌. అయితే ఇక‌పై కొత్త ర‌కం టైర్లు రానున్నాయి. వీటికి గాలి కొట్టించాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే ఆ టైర్లు పంక్చ‌ర్ కూడా కావు. అవును ఇది నిజ‌మే. మిచెలిన్ అనే టైర్ల కంపెనీ జ‌న‌ర‌ల్ మోటార్స్ అనే కార్ల త‌యారీ కంపెనీతో క‌లిసి ఎయిర్‌లెస్ వీల్స్ టెక్నాల‌జీని అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా ఉప‌యోగించే టైర్లు పంక్చ‌ర్ ప్రూఫ్ గా ప‌నిచేస్తాయి. ఇక ఈ టైర్ల‌ను ఉప్టిస్ ప్రోటోటైప్ టైర్లుగా ప్ర‌స్తుతం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వాణిజ్య పరంగా ఈ టైర్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తే వీటి పేరు మార్చే అవ‌కాశం ఉంది.

కాగా ఈ ఉప్టిస్ ప్రోటోటైప్ టైర్లకు గాలి కొట్టించాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే పంక్చ‌ర్లు కూడా అస్స‌లు ప‌డ‌వు. దీంతో దాదాపుగా ఎలాంటి రోడ్ల‌పైనైనా వాహ‌నంలో నిర్భ‌యంగా వెళ్ల‌వ‌చ్చు. అయితే ఈ టైర్లు వాణిజ్య ప‌రంగా వినియోగంలోకి రావాలంటే చాలా కాలం ప‌ట్టే అవ‌కాశం ఉంది. 2024 వ‌ర‌కు.. అంటే.. మ‌రో 5 ఏళ్ల పాటు ఈ టైర్ల కోసం వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఏది ఏమైనా.. ఈ టైర్లు గ‌న‌క ఒక్క‌సారి వినియోగంలోకి వ‌స్తే.. అప్పుడు ఎంతో మంది వాహ‌న‌దారుల ఇబ్బందులు చాలా వ‌ర‌కు తొల‌గిపోతాయ‌నే చెప్ప‌వ‌చ్చు.