ప్రస్తుత సమాజంలో ఇద్దరబ్బాయిలు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరమ్మాయిలు ఒకటవ్వడం కామన్ అయిపోయింది. కానీ వీరు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండటమే జరిగింది ఇప్పటివరకు. ఇలాంటి జంటల పెళ్లిళ్లను అర్థం చేసుకుని అక్కున చేర్చుకున్న తల్లిదండ్రులు చాలా అరుదు. కానీ చెన్నైలో జరిగిన ఓ వేడుక చూస్తే మాత్రం గుండెనిండా సంతోషం నిండిపోతుంది. ఎందుకంటే ఇద్దరమ్మాయిల వివాహాన్ని ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా జరిపారు. తమ కుమార్తెల సంతోషం కంటే ఏది ఎక్కువ కాదని నిరూపించారు.
సుభిక్షా సుబ్రమణ్యం(29) అనే మహిళ తమిళనాడులో జన్మించింది. 19 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు హార్మోన్లలో మార్పు కారణంగా పురుష లక్షణాలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం కెనడాలోని కాల్గెరీలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. సుభిక్షా కొన్ని రోజులు ఖతార్‌లో ఉంది. అనంతరం కెనడా వెళ్లి.. తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి ఆమె తల్లికి చెప్పింది. అదే నయం అవుతుందని తల్లి ఓదార్చింది.
మరోవైపు.. బంగ్లాదేశ్‌కు చెందిన టీనా దాస్ హిందూ కుటుంబంలో జన్మించింది. పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు భర్తతో ఉంది. తర్వాత తాను స్వలింగ సంపర్కురాలు (లెస్బియన్) అని గ్రహించి భర్తను వదిలేసింది. టీనా కూడా కాల్గెరీలోని ఓ ఆస్పత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే ఓ మొబైల్ యాప్ ద్వారా సుభిక్షా, టీనా స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఇళ్లలో ఈ పెళ్లి గురించి ప్రస్తావించారు. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని నెలల తర్వాత పెళ్లికి అంగీకరించారు. దాంతో ఆగస్టు 31న ఇద్దరూ చెన్నైలో పెళ్లి చేసుకున్నారు.