ఎంత ఎక్కువ జీతముంటే అంత ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెబుతారు. అన్ని చోట్లా ఇలా ఉండకపోయినా కొన్ని చోట్ల మాత్రం ఇది నిజమే. ఎంత ఎక్కువ సంపాదిస్తారో అక్కడే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐతే ప్రస్తుతం ఒక కంపెనీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విచిత్రమేమిటంటే, ఇక్కడ పెద్దగా ఒత్తిడి ఉండదు. పెద్దగా కాదు అసలు ఒత్తిడే ఉండదు. అయినా నెలకి 7లక్షల రూపాయలు చెల్లించనుంది. అవును, మీరు వింటున్నది నిజమే. నెలకి అక్షరాల ఏడు లక్షల రూపాయలు జీతంగా ఇవ్వడానికి మర్ఫీ గూడ్ వైనరీ సంస్థ ముందుకు వచ్చింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ కంపెనీ తనకి కావాల్సిన ఉద్యోగస్తుల కోసం ప్రకటన చేసింది. ముఖ్య్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఉద్యోగానికి వచ్చేవారికి ఎలాంటి ఒత్తిడి ఉండదు అంతేగాక తమకి నచ్చిన పనిని ఎంచుకోవచ్చు. ముందుగా మీకు అక్కడ జాబ్ వస్తుంది. ఆ తర్వాత అదే కంపెనీలో మీకు నచ్చిన జాబ్ చేసుకోవచ్చన్నమాట. ఏంటీ కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఏ పని కావాలో తర్వాత తెలుసుకోవచ్చంటున్నారు. మరి ఉద్యోగానికి ఎలా సెలెక్ట్ చేసుకుంటారన్న సందేహం కలుగుతుందా?
డోంట్ వర్రీ. ఇక్కడ కంపెనీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవాలి. మద్యం కర్మాగారంలో ఏయే పనులుంటాయనే విషయం దగ్గర నుండి ఈ కామర్స్ మొదలగు విషయాల పట్ల అవగాహన ఉండాలి. అలాగే వివిధ జట్లతో పని చేయాల్సి ఉంటుంది కాబట్టి భాషానైపుణ్యం ఖచ్చితంగా అవసరం. 2009లో ఇదే రకమైన ఉద్యోగాన్ని అందించిన కంపెనీ, ఉద్యోగస్థులకి సోషల్ మీడియాలో ప్రచారం చేసే పని అప్పగించారు. ఒక సంవత్సర కాలం పాటు ఈ పని ఉంటుంది. దీనికి 21సంవత్సరాలు, ఆ పైబడ్డ వారెవరైనా అప్లై చేసుకోవచ్చు.
ఇందులో పనిచేయాలనుకున్నవారు ముందుగా దరాఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎందుకు పని చేయాలనుకుంటున్నారో చిన్నపాటి వీడియోని పంపాల్సి ఉంటుంది. సృజనాత్మకత, నైపుణ్యం ఆదారంగా ఉద్యోగానికి ఎంపిక కాబడతారు. జూన్ 30వ తేదీ వరకు ఈ ఉద్యోగానికి దరాఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.