“ఏ సిద్ధాంతమైన ప్రజాస్వామ్యంపై పట్టు సంపాదించితే అది శక్తివంతంగా మారుతుంది.”
– కారల్ మార్క్స్.. ఇది ఆయన చెప్పిన మాట.. ఆయన వివరించిన లేదా విస్తరించిన మాట. ఈ మాటను మన నాయకులు పట్టించుకుంటారా లేదా అన్నదే ఓ డౌట్. ఇవాళ ఆయన జయంతి. వందేళ్ల మార్క్స్ రెండు వందల ఏళ్ల మార్క్స్ ఇంకా చెప్పాలంటే మూడు వందల ఏళ్ల మార్క్స్ మనతోనే ఉంటాడు. మనలానే ఉంటాడు. మనతోడై ఉంటాడు కూడా ! కొన్ని మాటలు గాంధీ చెప్పాడు కానీ మార్క్స్ మాదిరిగానే చెప్పాడు. భావ సారూప్యం కారణంగా గాంధీ చెప్పి ఉంటాడు అని సర్దుకుపోదాం. కానీ మార్క్స్ ను నిజాయితీగా పాటించడం అనుసరించడం జరగని పని అని మాత్రమే చెప్పగలను.
సైద్ధాంతిక భావజాలాల వ్యాప్తిలో పార్టీలు తమ ఉనికిని కోల్పోయిన రోజులు ఉన్నాయి. లేదా స్థిరం చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. అసలు ఉనికిని కాపాడుకుంటే చాలు అనుకున్నవి కొన్ని ఇవాళ్టికీ మనతోనే ఉన్నాయి. మార్క్స్ ను రాజకీయ సైద్ధాంతిక వాదిగా చూడలేం. కానీ సామాజిక విప్లవం అన్నది ఒకటి వస్తే ఇండియా లాంటి కొన్ని దేశాలు బాగుపడతాయి. మన దేశానికి సామాజిక విప్లవం ఇప్పుడు ఎంతో అవసరం.
కానీ మనం ప్రజా స్వామ్యాన్నే కాపాడుకోలేక కొట్టుకుని ఛస్తున్నాం కనుక మనకు విప్లవ నేపథ్యాలు తెలియవు. మన నాయకులకు కులాల కొట్లాటే తెలుస్తుంది కనుక వాళ్లనేమీ అనకూడదు. మార్క్స్ మన జీవితాలను ప్రభావితం చేస్తాడు. కానీ మనం మాత్రం ఆ ప్రభావాన్ని శరీరంలో దాచుకోం..మనస్సుల్లో ఇంకించుకోం. కనుక మనం మనలానే ఉంటూ సైద్ధాంతిక దృక్పథాలను చదువరి జ్ఞాపకంగా ఉంచుకుంటూ ఉంటాం. జయహో మార్క్స్ అని చెప్పడం సులువు. పాటించడం కష్టం. ఈ పద్ధతిని దాటుకుని ప్రవర్తించడం ఇంకా కష్టం.