డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

-

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది. మూఢనమ్మాకాలని బలంగా నమ్మడం వల్లే ఇలా జరుగుతుందని ఇదొక మానసిక రుగ్మత అని చాలా మంది చెబుతున్నారు. అయితే దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే సైకియాట్రిస్ట్ చెప్పిన విషయాలేంటో ఇక్కడ చూద్దాం.

డేల్యూజనల్ డిజార్డర్:

ఒక వ్యక్తి బలీయమైన,దుర్భేద్యమైన ఒక అపనమ్మకం పెంపొందించుకుని,ఆ నమ్మకం దృష్ట్యా ప్రవర్తించటం.

ఇదొక మానసిక వ్యాధి. దీనికి వైద్యం ఉంది.ఉదాహరణకి,సాధారణంగా అనుమానం జబ్బు కొంతమందికి ఉంటుంది.భార్య ఏతప్పూ చేయనప్పుడు కూడా ఎటువంటి ఆధారం లేకుండా అనుమానించే భర్తలు ఉంటారు. వీళ్ళు భార్య సెల్ ఫోన్లో నంబర్లను, సందేశాలను అనుమతి లేకుండా చూడడం, వెంబడించటం, నిఘా పెట్టించటం, నిజం చెప్పమని నిలదీయటం, మరీ మితి మీరితే హింసించడం, చివరకు హతమార్చడం జరుగుతుంది. ఆల్కహాల్ కి అలవాటు పడ్డవారిలో ఇది కొంచెం ఎక్కువ. దీనినే ఒథెల్లో సిండ్రోమ్ అని కూడా అంటారు.

వీరికి ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వారి అపనమ్మకం గానీ, అనుమానం గానీ మార్చుకోరు. ఈ మానసిక వ్యాధి రావటానికి చదువు, స్థాయి, డబ్బు, ఉద్యోగం ఏవీ అడ్డంకి కావు. ఎవరికైనా రావచ్చు. ఒంటరి జీవితం, అభద్రతా భావం, ఆత్మన్యూనత మొదలైనవి కారణాలు కాకపోయినా అవి ఈ జబ్బు కి దోహద పడొచ్చు. ఈ వ్యాధి కౌన్సిలింగ్ తో సాధారణంగా నయం కాదు, మందులు వాడవలసిన అవసరం ఉంది. అది కూడా దీర్ఘకాలం.

చిత్తూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మూఢనమ్మకం అనేది ఒక చిన్న భాగం మాత్రమే, ఈ సంఘటన జరగటానికి మూల కారణం ఈ మానసిక వ్యాధి. ఇందులో ప్రధానంగా ఇంటి పెద్దకి ఉన్న అపనమ్మకాన్ని మిగిలిన కుటుంబ సభ్యులు కూడా గాఢంగా నమ్ముతారు. భార్య, భర్త మాత్రమే నమ్మితే దాన్ని ఫోలీ డ్యూక్స్ అనీ, ఇంటిల్లి పాదీ నమ్మితే ఫోలి ఎ ఫ్యామిలీ అనీ అంటారు. ఇందులో ఇంటి పెద్ద చెప్పింది మిగిలిన వాళ్ళు ఏమాత్రం ప్రతిఘటించ కుండా తూ.చా తప్పకుండా పాటిస్తారు.

ఈ వ్యాధికి గురైన కుటుంబం సాధారణంగా ఒంటరిగా ఉంటారు, ఎవరినీ ఇంటికి రానివ్వరు, వాళ్ళు అరుదుగా బయటికి వస్తారు, ఎవరితో మాట్లాడరు. కొన్నాళ్లకి వాళ్ళ భోజన అలవాట్లలో మార్పులు వస్తాయి. వాళ్ళ జీవన విధానంలో మార్పులు వస్తాయి. వీళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్ సోకి గానీ, లేదా భోజనం మానేసి గానీ, లేదా సామూహిక ఆత్మహత్య చేసుకుని గానీ మరణిస్తారు.

అపనమ్మకం అనేది ఆయా సంస్కృతిని బట్టి ఉంటుంది. వాళ్ళు ఉండే భౌగోళిక, సాంస్కృతిక పరిధిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మన దేశంలో క్షుద్రపూజలు అని,చేతబడి అని ఉంటాయి. కాథలిక్ దేశాల్లో సాతాను అని, అలాగే దేవుడ్ని నమ్మని వాళ్ళలో గ్రహాంతర వాసులు అని రకరకాలు. కాబట్టి నమ్మకంలో విషయం మాత్రమే తేడా.

ఈ చిత్తూరు ఘటన మాత్రమే కాకుండా దేశంలో చాలాచోట్ల ఇటువంటి సంఘటనలు జరిగాయి. అయితే చాలాసార్లు ఇంట్లో అందరూ చనిపోయాక చాలా రోజులకు వాసన వచ్చి బయటకి తెలుస్తుంది. అలాగే ఇంట్లో కుళ్లుతున్న దేహాన్ని ఉంచి మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడే నివసిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

కొంతకాలం క్రితం బొబ్బిలిలో ఒక కుటుంబం ఇలాగే ఒంటరిగా ఉంటే వాళ్ళని పోలీసుల సహాయంతో బయటకు రప్పించారు స్థానికులు. అలాగే మొన్న ఆస్ట్రేలియా లో కూడా ఒక తల్లి, ముగ్గురు బిడ్డలతో ఇంట్లో చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.

ఈ మానసిక వ్యాధిని చాలా తీవ్రంగా పరిగణించాలి.దీనికి వైద్యం ఉంది. ఇందుకోసం ఆ కుటుంబాన్ని ఆసుపత్రిలో చేర్చి, వాళ్ళను కొన్ని రోజుల పాటు వేరువేరుగా ఉంచాలి. ఇంటి యజమాని లేదా ముఖ్య వ్యక్తికి వైద్యం చెయ్యటం ద్వారా అందరికీ నయం అవుతుంది. మంచి ఫలితం ఉంటుంది. అందువలన తొలి దశలో గుర్తించటం అవసరం.

ఇప్పుడున్న కరోనా వలన ఒంటరి జీవితం, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న తప్పుడు సమాచారం,ఇతర మతాల పైన ద్వేషం, పొరుగింటి వారిపై అసూయ ఇటువంటివి అన్నీ కూడా మనలోని అభద్రతా భావాన్ని కొంచెం కొంచెం గా పెంచి మానసిక వ్యాధికి కారణం అవుతాయి.అందువలన ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news