నిఫా వైరస్ అంటే ఏంటి? దాన్ని నయం చేయొచ్చా? కేరళ ప్రజలు ఈ వైరస్ అంటేనే ఎందకు భయపడుతున్నారు?

751

నిఫా వైరస్ ముఖ్యంగా గబ్బిలాల వల్ల వ్యాప్తి చెందుతుంది. వాటినే ఎగిరే నక్కలు అని కూడా పిలుస్తారు. లేదా ఫ్రూట్ బ్యాట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా పళ్లు తిని బతుకుతాయి.

నిఫా వైరస్.. ఈ పేరును మీరు గత సంవత్సరమే విని ఉంటారు. గత సంవత్సరం కేరళలో ఈ వైరస్ వల్ల చాలామంది చనిపోయారు. ఈ వైరస్ గత సంవత్సరమే వ్యాప్తి చెందింది కదా.. మళ్లీ ఈ వైరస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.. అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. ఈ వైరస్ కేరళలో మళ్లీ వ్యాపించింది.

అవును.. కొచ్చికి చెందిన 23 ఏళ్ల యువకుడికి నిఫా వైరస్ సోకింది. అందుకే.. మళ్లీ ఈ వైరస్ గురించి కేరళ ప్రజలు భయపడుతున్నారు.

నిఫా ఎలా వ్యాప్తి చెందుతుంది?

నిఫా వైరస్ ముఖ్యంగా గబ్బిలాల వల్ల వ్యాప్తి చెందుతుంది. వాటినే ఎగిరే నక్కలు అని కూడా పిలుస్తారు. లేదా ఫ్రూట్ బ్యాట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా పళ్లు తిని బతుకుతాయి.

నిఫా వైరస్ గబ్బిలాల మూత్రం, లాలాజలం, అవి వాటి పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు విడుదలయ్యే స్రావాల్లో నిఫా వైరస్ ఉంటుంది. అంటే.. గబ్బిలాలు తిని వదిలేసిన పళ్లను తినడం వల్ల కానీ.. అవి సంచరించే ప్రాంతాల్లో మనుషులు సంచరించినా.. అవి తిరిగిన ప్రాంతాల్లో ఉండే వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతుంది.

ఈ వైరస్ సోకిన వాళ్లకు జ్వరం రావడం, తలనొప్పి లేవడం, నిద్రమత్తు, మానసిక ఆందోళన, కోమా.. చివరకు మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది.

మరికొందరిని ఈ వైరస్ సోకడం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. అంతే కాదు.. శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

మొదటగా ఈ వైరస్ ఎక్కడ బయటపడింది?

నిజానికి ఈ వైరస్ ముందు భారత్ లో బయటపడలేదు. 1999లో మలేషియాలో వెలుగు చూసింది. మలేషియాలోని పందుల ఫామ్ లోకి గబ్బిలాలు రావడంతో ఈ వైరస్ వెలుగు చూసింది.

ఆతర్వాత బంగ్లాదేశ్ లో 2011 లో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఆ దేశంలో అప్పుడప్పుడు ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఈ వైరస్ ఇండియాకు సోకింది. ఈశాన్య భారత్ లోనూ ఈ వైరస్ ఆనవాళ్లు కనిపించాయి.

ఇవే కాకుండా వైరస్ సోకే ప్రమాదం ఉన్న దేశాల్లో కంబోడియా, ఘనా, ఇండోనేషియా, మడగాస్కర్, ఫిలిప్పిన్స్, థాయిలొండ్ లాంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో గబ్బిలాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి.

READ ALSO  రేపు నగరానికి రాష్ట్రపతి..

అయితే.. ఈ వైరస్ కేవలం గబ్బిలాల ద్వారా మాత్రమే కాకుండా.. గబ్బిలాల నుంచి పందులకు.. పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

మలేషియా, సింగపూర్ లో జరిగింది అదే. పందుల మలం, అవి వదిలే ఇతర రకాల ద్రవాల వల్ల ఇది వ్యాప్తి చెందింది. మనుషుల నుంచి మనుషులకు కూడా అదే విధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

నిఫా వైరస్ ను నయం చేయొచ్చా?

నిజానికి.. నిఫా వైరస్ ను నయం చేసే వాక్సిన్ అయితే ఇంతవరకు రాలేదు. ఆ వైరస్ సోకితే మరణమే. అయితే.. ఈ వైరస్ ను మనుషులకు సోకకుండా నివారించగలగడమే పరిష్కారం. నిఫా వైరస్ ఎక్కడైనా సోకితే.. ఆ ప్రాంతంలో ఉన్న ఫామ్స్ ను గానీ.. ఇతర జంతువులను కానీ సపరేట్ గా ఉంచాలి. ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి. గబ్బిలాలను నివాస ప్రాంతాల్లోనికి రానీయకూడదు. అవి తిన్న పదార్థాలేవీ తినకూడదు. నిఫా వైరస్ సోకిన వాళ్లకు దూరంగా ఉండటం వల్ల మాత్రమే నిఫా వైరస్ రాకుండా నివారించవచ్చు.