ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపే ఆసక్తిగా చూస్తోంది. నిన్న వచ్చిన ఐదురాష్ట్రాల ఫలితాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్విజయదుందుబి మోగించగా… మిజోరంలో అక్కడి ప్రాంతీయ పార్టీ గెలిచింది. ఇక..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండో సారి గెలిచి మహా కూటమిని మట్టికరిపించింది.అయితే.. మిగితా నాలుగు రాష్ట్రాల ఫలితాల కన్నా.. తెలంగాణ ఫలితాలపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే.. తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పాటుఅయిందంటే.. దానికి ముఖ్య కారకులు కేసీఆర్.
ఒక ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం.. ఇప్పుడు రాజకీయ పార్టీగా ఎదగడం.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిరంతరం పనిచేస్తున్న పార్టీగా మెప్పుపొందడం.. ఈ పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసమే అన్న విధంగా ప్రజల కోసం ప్రారంభించిన ఎన్నో సంక్షేమ పథకాలు.. ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీని మరోసారి విజయకేతనం ఎగురవేసేలా చేశాయి. బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు.
అయితే.. నిన్న వచ్చిన ఫలితాల్లో ఓ ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే… ఈ ఎన్నికల్లో చాలామంది అన్నదమ్ములు పోటీ చేశారు. అంటే.. టీఆర్ఎస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరు బరిలో దిగారు. పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోగా… నరేందర్ రెడ్డి.. కొడంగల్ నుంచి పోటీ చేసి గెలిచాడు. రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాడు నరేందర్ రెడ్డి.
ఇక.. నల్గొండ కొమటిరెడ్డి సోదరులు ఇద్దరు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా.. నల్గొండ నుంచి వెంకట్ రెడ్డి ఓడిపోగా.. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గెలిచాడు. మరోవైపు ఖమ్మం జిల్లా మధిర నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన భట్టి విక్రమార్క గెలవగా… ఆయన సోదరుడు మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఇలా.. తమ్ముళ్లు గెలువగా.. అన్నలు ఓడిపోయి చరిత్ర సృష్టించారు.