కవిత: మా ఆయన చిన్నపిల్లాడు

-

నువ్వు చాలాసార్లు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తావు తెలుసా?
మళ్ళీ ఎప్పుడెప్పుడని చిన్నపిల్లాడిలా అడగకు
నేను చెప్పలేను.
అందులో కొన్ని సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కే సందర్భాలూ ఉన్నాయి.
అయినా చెప్పమని మొండికేస్తున్నావా?
ఐతే ఒకటి చెబుతా..

ఆరోజు నీకు గుర్తుందా?
వర్షాకాలపు సాయంత్రం
ఆకాశాన్ని కమ్మేసిన మబ్బులు
ఇళ్ళలోకి చీకట్లని పంపుతున్నాయి
ఒక వర్షపు చుక్క భూమిపై పడింది.
ఆ తర్వాత ఇంకోటి,
అలా ఒకదానికొకటి పోటీపడుతూ
భూమి మీద దిగిపోయాయి.

ఆ వర్షపు చినుకుల వంక చూస్తున్న నీకు,
ఏం గుర్తొచ్చిందా అని నీ దగ్గర దాకా వచ్చాను.
అది నువ్వు చూసుకోలేదేమో!
ఒక్కసారిగా వెనక్కి తిరిగావు
నీ వెనకాల నిలబడి నువ్వు చూస్తున్న వైపే చూస్తున్న నాకు,
నీ మలుపుకి, నా కాలు మీద పడ్డ నీ పాద స్పర్శ
నీ వైపు చూసేలా చేసింది.

అప్పుడు నువ్వేం చేసావో తెలుసా?

ఏం చేసానని అలా అమాయకంగా చూడకు.

ఇంా గుర్తు రాలేదా?

అయితే ఇంకోటి చెబుతా?

అది ఎండాకాలం అనుకుంటా
కాదు కాదు అది వసంతం.
అప్పుడేగా నువ్వు నాలోకి వచ్చింది.

ఒకరోజు,
ఇంటి ముందు వాకిట్లో చెట్టు కింద పడిన ఆకులు
మద్యాహ్నపు గాలికి గలగలమంటున్నాయి.
అప్పుడే ఎక్కువవుతున్న ఎండలు
ఎవ్వర్నీ బయట తిరగనివ్వట్లేదు.
ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను.
సడెన్ గా ఆ గలగలలు ఎక్కువగా వినబడసాగాయి.
గాలి ఎక్కువయ్యిందేమో అనుకున్నా
కొన్ని సెకన్ల తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది.

ఏమీ తోచక, ఏదో ఆలోచిస్తున్న నాకు,
ఆ ఆకుల సవ్వడిలో మార్పు ఆసక్తిగా అనిపించింది.
అదెప్పుడు ఎక్కువవుతుందా అని ఎదురుచూడసాగాను.
ఎంతకీ ఎక్కువ అవకపోయేసరికి
బయటకెళ్ళి చూద్దామని ముందుగదిలోకి వచ్చాను.

అప్పుడే కెవ్వున కేక వినపడింది.
ఆ శబ్దానికి నాకు మతిపోయినట్టయింది.
కిందపడిపోయాను
కళ్ళు మూతలు పడ్డాయి
గాలి ఆడటం లేదు.
నన్నలా చూసేసరికి నువ్వు కంగారు పడ్డావు.
నా పేరు పెట్టి పిలుస్తూ, లెమ్మని అరుస్తున్నావు.
సినిమాలు బాగా చూస్తావేమో!
నీ ప్రయత్నం చేసావ్.

అవును, అయినా ఇదంతా నాకెలా గుర్తుంది.
నీకేమైనా అర్థమైందా?
లేదు కదా!

అందుకేగా నువ్వు చిన్నపిల్లాడివనేది.

అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా?

ఇంకోటి చెబుతా ఆగు.

సూటిగా చెప్పచ్చుగా
ఇంత తిరకాసు ఎందుకంటావా?
నువ్వెప్పుడైనా, ఏదైనా సూటిగా చెప్పావా?
మరి నన్నెందుకు చెప్పమంటావ్
సరే, నువ్వడుగుతున్నందుకు ఈ సారి చెప్తాను.

చలికాలం పూట
గాలులు ఏ మంచు పర్వతాన్నో తాకి వస్తున్నట్టున్నాయి.
వాటి చల్లదనం మనలో పూర్తిగా నిండిపోయిన సమయంలో

అదేంటి నవ్వుతున్నావ్…
ఏం చెప్తున్నానో అర్థమైందా?
కాలేదు చెప్పు అంటావా?
మళ్ళీ నవ్వుతున్నావు
ఇంకా నవ్వుతున్నావా?
నేను చెప్పను పో..
నువ్వెంత బతిమాలినా నేను చెప్పను.
ముందు నవ్వాపు

ఆపవా?

ఆ నవ్వే నిన్ను చిన్నపిల్లాడ్ని చేసింది.
నన్ను నీ దాన్ని చేసింది.

                                 -శ్రీరామ్ ప్రణతేజ.

Read more RELATED
Recommended to you

Latest news