కవిత: నా కోసం వస్తావా?

-

బాధల్లో ఉన్నాను
బయటపడే దారి కనిపించట్లేదు.

నువ్వున్నప్పుడు నా దగ్గరకు రావడానికి
భయపడ్డ బాధలు
నువ్వెళ్ళగానే నన్ను చుట్టుముట్టాయి.

నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నవ్వితే వచ్చే కన్నీళ్ళు,
ఏడిస్తే కూడా వస్తాయని, నువ్వు వెళ్ళాకే తెలిసింది.

దుఃఖంతో గుండె బరువెక్కింది.
కదలడానికి కూడా శక్తి సరిపోవట్లేదు

సంతోషాలనే నాతో పంచుకున్నావు
బాధల్ని కూడా పంచుకుంటే బాగుండేది కదా!
అవి ఎలా ఉంటాయో నువ్వున్నప్పుడే తెలిసేది.

నిన్ను పోగొట్టుకున్న క్షణం గుర్తొచ్చి,
నా మీద నాకు కోపం కలుగుతుంది.
ఆ క్షణం నా జీవితంలో లేకుండా ఉంటే,
ఈ క్షణం ఇలా ఉండేది కాదు.

చెయ్యందించే ఆప్తులు లేరు,
భుజం తట్టే మిత్రులు లేరు,
ఒక్కడినే మిగిలాను.

ఈ క్షణం, ఈ నిమిషం
నువ్వు నాకు గుర్తొస్తున్నావు.

బాధల్లో ఉంటే తప్ప నువ్వు నాకు గుర్తురాకపోవడం
నా దురదృష్టం.

ఇప్పుడేమని అడగను నిన్ను.
ఏం అర్హత ఉంది నాకు.

అయినా అడుగుతున్నా సిగ్గు విడిచి
నాకోసం వస్తావా?

ఎవ్వరేమనుకున్నా నేనేం పట్టించుకోను.
నువ్వేమంటావన్నదే నా పట్టింపు
చెప్పు నాకోసం వస్తావా?

నీ కౌగిలి నాక్కావాలి,
నా కలతల్ని పోగొట్టుకోవడానికి.
కౌగిలి కష్టమైతే కనీసం కనిపించు,
బాధల్ని తట్టుకునే బలమైనా తెచ్చుకుంటా.

-శ్రీరామ్ ప్రణతేజ.

Read more RELATED
Recommended to you

Latest news